April 4, 2026

హిందీ రుద్దుడు ఆపండి: స్టాలిన్ ఫైర్!

TAMILNADU CM STALIN

TAMILNADU CM STALIN

సీబీఎస్‌ఈ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుండి అమలు చేయనున్న త్రిభాషా విధానంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో ప్రాంతీయ భాషల ఉనికిని దెబ్బతీస్తూ, హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ విధానం భారతదేశ భాషా వైవిధ్యాన్ని గౌరవించకపోవడమే కాకుండా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్టాలిన్ విమర్శించారు. శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులపై ఇది అనవసర భారాన్ని మోపుతుందని ఆరోపించారు.

కేంద్రం ప్రతిపాదిస్తున్న మూడు భాషల సూత్రం వాస్తవానికి హిందీ మాట్లాడని ప్రాంతాల్లోకి ఆ భాషను జొప్పించే ఒక రహస్య యంత్రాంగమని స్టాలిన్ విమర్శించారు. ఇది కేవలం విద్యా సంస్కరణ మాత్రమే కాదని, ఉద్దేశపూర్వకంగా హిందీకి ప్రాధాన్యతనిచ్చే కేంద్రీకరణ ఎజెండా అని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల కంటే దక్షిణాది విద్యార్థులపైనే ఎక్కువ భారం పడుతుందని, ఇది వివక్షాపూరిత స్వభావమని ఆయన ధ్వజమెత్తారు.

కేరళలో LDF రోజులెక్కపెట్టుకోవాల్సిందే.. మోడీ ఈ వార్తను కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వం భారతీయ భాషలను ప్రోత్సహిస్తామని చెప్పడం పెద్ద కపటత్వమని స్టాలిన్ ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయాల్లో తమిళాన్ని తప్పనిసరి భాషగా చేయడంలోనూ, తమిళ ఉపాధ్యాయులను నియమించడంలోనూ విఫలమైన కేంద్రం, ఇప్పుడు రాష్ట్రాలకు ఉపన్యాసాలు ఇవ్వడం సరికాదని అన్నారు. భాషా వైవిధ్యాన్ని అణచివేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

తమిళనాడులోని ఏఐఏడీఎంకే మరియు దాని ఎన్‌డీఏ మిత్రపక్షాలు ఈ విషయంలో తమ వైఖరిని స్పష్టం చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తారా? లేక రాష్ట్ర విద్యార్థుల హక్కులు మరియు గుర్తింపు కోసం పోరాడుతారా? అని ఆయన ప్రశ్నించారు. లక్షలాది మంది భారతీయుల భాషా గుర్తింపును అవమానించేలా ఉన్న ఈ విద్యా విధానాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

#MKStalin #StopHindiImposition #LanguageDiversity #CBSE #TamilNadu #EducationPolicy #Federalism #LanguageRights

కేరళలో LDF రోజులెక్కపెట్టుకోవాల్సిందే.. మోడీ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *