పెట్టుబడులు, మౌలిక వసతులే మా లక్ష్యం: మంత్రి పార్థసారథి
విజయవాడ: గత ప్రభుత్వ ఐదేళ్ల పాలన లక్ష్యరహితంగా సాగి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాల పేరిట ఆదాయ మార్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, పోలవరం వంటి కీలక ప్రాజెక్టును కూడా బాధ్యతారహితంగా నిర్వహించారని మండిపడ్డారు.
ప్రచార అవసరాల కోసం మూడు రాజధానుల అంశాన్ని వాడుకున్నారే తప్ప అభివృద్ధిపై శ్రద్ధ పెట్టలేదని తెలిపారు. గత ప్రభుత్వం 31 శాతం అధికంగా అప్పులు తీసుకుందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఇరిగేషన్ రంగానికి ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ప్రాజెక్టులనే అన్న కారణంతో కొన్ని పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఆరోపించారు.
తమ ప్రభుత్వం మాత్రం బాధ్యతాయుతంగా ముందుకెళ్తోందని స్పష్టం చేసిన మంత్రి, ఎన్టీఆర్ పెన్షన్ పథకానికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇంకా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. 25 ప్రత్యేక పాలసీల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రతిపక్ష హోదా లేకుండా, అసెంబ్లీకి రాకుండా ఒకపక్కగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓలను మెరుగుపరచి పీపీపీ విధానాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పీపీపీ అమలులో ఉందని, దాని వల్ల ప్రభుత్వంపై రూ.163 కోట్ల భారం తప్పుతుందన్నారు. పీపీపీ ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 15 శాతం ఎక్కువ సీట్లు రావడం ఇష్టంలేదా? అని ప్రశ్నించారు.
సోలార్ కంపెనీల ఒప్పందాలను రద్దు చేయడం వల్ల రాష్ట్రంపై రూ.9 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. వ్యక్తిగత స్వార్థ రాజకీయాలా? లేక రాష్ట్ర అభివృద్ధియా? అని ప్రతిపక్షాన్ని నిలదీశారు. పెట్టుబడిదారులను భయపెట్టి రాష్ట్రానికి రాకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రూఫ్‌టాప్ సోలార్‌ను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విజన్–2047 లక్ష్యాలను మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తున్నామని, నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలో రాష్ట్రానికి క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ రాబోతోందని వెల్లడించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కమిట్‌మెంట్‌తో శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, యువ నేత లోకేష్ అత్యంత మెచ్యూర్‌గా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మూడు పార్టీలు బలమైన శక్తిగా ఉండటం కూడా పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిస్తోందన్నారు.
గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో నివాసయోగ్యతలేని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, తమ హయాంలో పథకాలు పొందినవారిని ఇబ్బందులకు గురిచేసి ఇళ్లను రద్దు చేశారని ఆరోపించారు. అర్హత ఉన్న ప్రతి పేదవారికి ఇల్లు కట్టించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
#పార్థసారథి
#AP Politics
#Andhra Pradesh Development
#Investments
#PPP Model
#Vision 2047
#Telugu Political News