మిర్చి రైతులకు 'కూటమి' భరోసా
ధరల స్థిరీకరణకు మంత్రి అచ్చెన్నాయుడు మాస్టర్ ప్లాన్!
కోల్డ్ స్టోరేజ్ నిల్వలపై రుణాలు.. 100% ఇ-క్రాప్ నమోదు.. మార్కెట్లలో మౌలిక వసతుల పెంపు!
ముందస్తు చర్యలతో ధరల నియంత్రణ
గత ఏడాది మిర్చి రైతులు ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం గుంటూరులోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో మిర్చి సీజన్‌పై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని, సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల ఉత్పాదకత కూడా గత ఏడాది కంటే సుమారు 44 శాతం తగ్గిందని వివరించారు.
కోల్డ్ స్టోరేజ్ నిల్వలపై రుణాలు
రైతులు ఆర్థిక ఇబ్బందులతో తక్కువ ధరకే అమ్ముకోకుండా ఉండేందుకు, కోల్డ్ స్టోరేజీలలో నిల్వ ఉంచిన మిర్చిపై బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. మిర్చి సాగు చేసిన ప్రతి రైతు వివరాలను 100 శాతం ఇ-క్రాప్‌లో నమోదు చేస్తున్నామని, దీనివల్ల రైతులకు ప్రభుత్వ పథకాలు, బీమా అందడం సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఏటా ఒకే రకమైన పంట వేసి నష్టపోకుండా, డిమాండ్‌ను బట్టి పంటలు పండించేలా ‘క్లస్టర్ విధానం’ తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్కెట్ యార్డుల్లో రైతులకు తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు మరియు ముందస్తుగా ‘అన్నదాన’ కార్యక్రమాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
అక్రమాలకు తావులేకుండా నిఘా
మార్కెట్లలో ప్రస్తుతం ఉన్న 100 కంప్యూటర్ వెయిట్ మెషీన్ల సంఖ్యను పెంచాలని, రైతులకు తప్పనిసరిగా రసీదులు అందజేయాలని మంత్రి స్పష్టం చేశారు. రసీదులు ఇవ్వని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిర్చి పంటను ఆశించే నల్లి తామర వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యవసాయ శాఖ ద్వారా తగిన నివారణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకస్మిక వర్షాలు వస్తే బస్తాలు తడవకుండా షెడ్లు, కవర్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
రైతుల ఆదాయమే లక్ష్యం
గత ఏడాది 1.96 లక్షల హెక్టార్లలో సాగు జరగగా, ఈ ఏడాది అది 1.06 లక్షల హెక్టార్లకు తగ్గిందని, తక్కువ దిగుబడి ఉన్నందున మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక రైతులకు నష్టం కలగకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే మిర్చి లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు.
#ChilliFarmers #Atchennaidu #GunturMirchiYard #AndhraPradeshAgriculture #ChilliPrices #ECrop #FarmerSupport #GunturNews #APGovt #MarketReform
