యుద్ధం ముంగిట మధ్యప్రాచ్యం
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై జెనీవాలో చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. అగ్రరాజ్యం అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరిస్తుండగా, ఇరాన్ తన పట్టును నిరూపించుకునేందుకు కీలకమైన అంతర్జాతీయ జలమార్గాన్ని మూసివేసి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.
అమెరికా యుద్ధ విమానాల మోహరింపు
గత 24 గంటల్లో అమెరికా తన వైమానిక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ 50 యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యానికి తరలించింది. ఇందులో అత్యంత అధునాతనమైన ఎఫ్-22, ఎఫ్-35, ఎఫ్-16 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇరాన్ చుట్టుపక్కల ఇప్పటికే అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ మోహరించి ఉండగా, తాజాగా ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ వంటి విమాన వాహక నౌకలు కూడా అట్లాంటిక్ మీదుగా పశ్చిమాసియా దిశగా కదులుతున్నాయి.
చరిత్రలో తొలిసారి ‘హార్ముజ్’ జలసంధి మూసివేత
అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేస్తూ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్’ జలసంధిని మంగళవారం కొన్ని గంటల పాటు మూసివేసింది. చరిత్రలో ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేయడం ఇదే తొలిసారి. ఆ సమయంలో అక్కడ సైనిక విన్యాసాలు నిర్వహించి, తమ సముద్ర జలాలపై తమకే సర్వాధికారాలు ఉన్నాయని అమెరికాకు బలమైన హెచ్చరిక పంపింది.
ప్రపంచ మార్కెట్‌కు పట్టుకొమ్మ ‘హార్ముజ్’
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఈ ఇరుకైన జలసంధి ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటిది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి దేశాల నుంచి ముడి చమురు, గ్యాస్ ఎగుమతులు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో 20 శాతం ఇక్కడి నుంచే వెళ్తుంది. ముఖ్యంగా చైనాకు ఇది అతిపెద్ద వాణిజ్య మార్గం కాగా, ఇరాన్ తాజా చర్యతో గ్లోబల్ మార్కెట్‌లో ధరల పెరుగుదలపై ఆందోళన మొదలైంది.
భారత్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం
హార్ముజ్ జలసంధి మూసివేత భారత్‌కు అత్యంత కీలకమైన అంశం. మన దేశానికి వచ్చే ముడి చమురులో 40 శాతం, సహజ వాయువు (LNG) దిగుమతుల్లో 54 శాతం ఈ మార్గం ద్వారానే వస్తాయి. ప్రతిరోజూ దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ జలసంధిని దాటే భారత్ చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మార్గాన్ని తెరిచినప్పటికీ, యుద్ధం గనుక సంభవిస్తే భారత్ వంటి వర్ధమాన దేశాల ఇంధన భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
#MiddleEastCrisis #IranVsUSA #StraitOfHormuz #WarAlert #GlobalOilMarket #DefenseNews #InternationalTensions #Geopolitics

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
