March 27, 2026

మమతా Vs మోడీ మాటల యుద్ధం!

  • మీ భార్యకు ముందుగా సిందూరం పెట్టలేకపోతే, దేశానికి పెట్టినట్లు ఎలా చెబుతారు?

కోల్‌కతా: జాతీయ భద్రతా చర్యలపై రాజకీయ విమర్శలు ముదిరుతున్న వేళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు గుప్పించారు. “మీ భార్యకు ముందుగా సిందూరం పెట్టలేకపోతే, దేశానికి పెట్టినట్లు ఎలా చెబుతారు?” అంటూ మమతా తేల్చి చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దేశభక్తిని రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

ఇటీవల అలీపుర్‌ద్వార్‌లో జరిగిన బీజేపీ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు శువేందు అధికారి, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కలిసి “ఆపరేషన్ బెంగాల్” ను ప్రకటించారు. ఇది 2026 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పునాదిగా ఉండబోతుందన్న సంకేతమిచ్చారు. అయితే, దీనికి మమతా ఘాటుగా స్పందించారు.

“ఆపరేషన్ సిందూర్” అనే పేరుకు రాజకీయ ఉద్దేశాలే ప్రధాన కారణం అని వ్యాఖ్యానించిన మమతా, “ఇప్పుడే ప్రధాని విదేశాల్లో ప్రతినిధులుగా ఇతర పార్టీల ఎంపీలు మాట్లాడుతుంటే, మోడీ రాజకీయ ప్రయోజనాల కోసం ర్యాలీకి రావడం శోచనీయం. ఇది ఎన్నికల ప్రచారమే. దేశ ప్రతిష్టను ఈ విధంగా దిగజార్చడం క్షమించదగినది కాదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతటితో ఆగని ఆమె, “మీరు నిజంగా ధైర్యవంతులైతే రేపే ఎన్నికలు పెట్టండి. మేమూ సిద్ధమే, బెంగాల్ సిద్ధంగా ఉంది. మిమ్మల్ని ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అంటూ సవాల్ విసిరారు. అంతేగాక, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మందిని హత్య చేసిన దుండగులను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదని మమతా ప్రశ్నించారు.

సిందూర్‌పై దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ సమాధానం
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రధాని మోడీ దేశం తరఫున ధైర్యంగా తీసుకున్న నిర్ణయంగా అభివర్ణించారు. “పవిత్రమైన సిందూర్ ఖేలా నేలపై నిలబడి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ కొత్త సంకల్పాన్ని ప్రకటించడం గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రజల ఆవేశాన్ని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పిన మోడీ, “ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదురుని నుంచి సిందూరును తుడిచేయాలని చూశారు. కానీ మన జవాన్లు వారి తలకెత్తకుండా ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పారు” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *