- ఏపీ లో తగ్గిన మద్యం ధరలు..
- అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ధరలు..
- మందుబాబులకు గుడ్ న్యూస్..
రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపింది. తగ్గించిన ధరలను అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ప్రస్తుతం దుకాణాల్లో పాత ఎమ్మార్పీలతో ఉన్న బాటిళ్లను ఆ ధరలకే విక్రయిస్తారు. కొత్తగా వచ్చే స్టాకును తగ్గించిన ధరలతో అమ్ముతారు. ఏపీలో గత ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోడానికి అనుమతిస్తున్నారు.
తగ్గిన బ్రాండ్లు ఇవే..
ధరలు తగ్గిన బ్రాండ్లలో మాన్షన్ హౌస్ ఒకటి. 2019లో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి క్వార్టర్ రూ.110 ఉన్న మద్యాన్ని వైసీపీ హయంలో ఓ దశలో రూ.300కు విక్రయించారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ధరలు తగ్గించి చివరకు రూ.220కు ఫిక్స్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ ధర రూ.440 నుంచి రూ.380కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గించారు.
రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఇదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గించారు. యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1600 నుంచి రూ.1400కు తగ్గింది.
అన్ని బ్రాండ్లపై కొత్త ధరలు..
మద్యం ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో చర్చించి ధరల సవరణపై సిఫారసు చేయనుంది. అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. కమిటీ నిర్ణయించక ముందే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించుకుంటున్నాయి. మరో రెండు ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు రెండు మూడు రోజుల్లో ధరలు తగ్గించనున్నాయి.
హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో మద్యం ధరల సవరణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అన్ని కంపెనీలతో ధరల సవరణపై చర్చలు జరపనుంది. బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ధరలను పరిశీలించనుంది. ఏపీ, తెలంగాణలో విక్రయించే బ్రాండ్ల ధరల్లో భారీ వ్యత్యాసాలుంటే వాటిని ప్రశ్నించే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా ధరలు తగ్గిస్తున్నాయని చెబుతున్నారు.