ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మానవత్వం మంటగలిసే ఒక వికృత ఘటన వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియుడి భార్యపై కక్ష పెంచుకున్న ఒక మహిళ, పక్కా పథకం ప్రకారం ఆమెకు హెచ్ఐవీ (HIV) సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించింది.
బాధితురాలు వృత్తిరీత్యా వైద్యురాలు కావడం గమనార్హం. ఈ దారుణానికి సహకరించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి నర్సుతో సహా మొత్తం నలుగురిని పోలీసులు ఆదివారం (జనవరి 25) అరెస్ట్ చేశారు.
సినీ ఫక్కీలో రోడ్డు ప్రమాదాన్ని సృష్టించి, ఆ గందరగోళంలో ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన బి. బోయ వసుంధర (34) అనే మహిళకు ఒక వ్యక్తితో గతంలో సంబంధం ఉండేది. అయితే, అతను మరొక మహిళను (వైద్యురాలిని) వివాహం చేసుకోవడంతో వసుంధర అతనిపై, అతని భార్యపై పగ పెంచుకుంది.
ఎలాగైనా ఆమె జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్న వసుంధర, అదోనిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కొంగే జ్యోతి (40) సహాయం కోరింది.
జ్యోతి ద్వారా హెచ్ఐవీ సోకిన రక్తాన్ని సేకరించి, దానిని ఇంజెక్షన్ ద్వారా బాధితురాలికి ఎక్కించేందుకు పథకం రచించింది. ఈ కుట్రలో జ్యోతితో పాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా భాగస్వాములయ్యారు.
జనవరి 24న బాధితురాలు వెళ్తున్న సమయంలో నిందితులు కావాలనే ఒక కృత్రిమ రోడ్డు ప్రమాదాన్ని సృష్టించారు. ఆ ప్రమాదం జరిగిన వెంటనే సహాయం చేస్తున్నట్లు నటించి, గందరగోళం మధ్య వసుంధర ఆ హెచ్ఐవీ ఇంజెక్షన్‌ను బాధితురాలి శరీరంలోకి ఎక్కించింది.
దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వివాహేతర సంబంధం విఫలమవడంతో ఏర్పడిన కక్షే ఈ దారుణానికి కారణమని తేలింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
#Kurnool #CrimeNews #AndhraPradesh #HIVAttack #BreakingNews #PoliceAction