KTR Fire: అసలే గ్యాస్ కొరత.. సిలిండర్ సైజు తగ్గిస్తారా?
హైదరాబాద్: దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో నెలకొన్న ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ సరఫరా నిలిచిపోయి సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్రం మాత్రం “కొరత లేదంటూ” కల్లబొల్లి మాటలు చెబుతోందని ఆయన ధ్వజమెత్తారు.
మంగళవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ భారీ నిరసన చేపట్టారు. చేతిలో గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులు పట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సామాన్యుడిపై భారమే లక్ష్యమా?
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వం సామాన్యులను వంచించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. “ప్రస్తుతం ఉన్న 14 కిలోల గ్యాస్ సిలిండర్‌ను భవిష్యత్తులో 10 కిలోలకు తగ్గించే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ధరలు పెంచడమే కాకుండా, పరిమాణాన్ని తగ్గించి ప్రజల నడ్డి విరవాలని చూస్తున్నారు” అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ కొరత వల్ల హోటళ్లు, హాస్టళ్లు, చిన్న తినుబండారాల దుకాణాలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది!
ఇదే క్రమంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గ్యాస్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ అడిగితే.. పెట్రోలియం శాఖ కేంద్రం పరిధిలో ఉందని, తామేమీ చేయలేమని చేతులెత్తేయడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో గ్యాస్ కోసం ప్రజలు అల్లాడుతుంటే ఇరు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయని మండిపడ్డారు.
కేటీఆర్ డిమాండ్లు ఇవే:
పరిస్థితి తీవ్రతను వివరిస్తూ ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి కేటీఆర్ లేఖ రాశారు. అందులో ప్రధానంగా ఈ క్రింది అంశాలను ప్రస్తావించారు:
- ధరల స్థిరీకరణ: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలపై తక్షణమే ‘ప్రైస్ ఫ్రీజ్’ (ధరల పెరుగుదల నిలిపివేత) విధించాలి.
- రియల్ టైమ్ డాష్‌బోర్డ్: ఏ జిల్లాలో ఎంత గ్యాస్ అందుబాటులో ఉందో ప్రజలకు తెలిసేలా ఆన్‌లైన్ డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలి.
- బ్లాక్ మార్కెట్ నియంత్రణ: గృహ అవసరాల సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు మళ్లించే బ్లాక్ మార్కెట్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- కీలక సేవలకు ప్రాధాన్యత: ఐటీ కారిడార్‌లోని పీజీ హాస్టళ్లు, గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికలను అత్యవసర సేవల కింద గుర్తించి నిరంతర సరఫరా అందించాలి.
యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, దానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సింది పోయి, సామాన్యులను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని కేటీఆర్ హెచ్చరించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభంపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

