
- కేరళ ప్రభుత్వాన్ని సంప్రదించిన పంచాయితీ!
కేరళలో ‘పాకిస్తాన్ ముక్కు’ విపరీతమైన చర్చ జరుగుతోంది. దానిని పీకి పారేయాలని అక్కడ జనం కోరుతున్నారు. పాకిస్తాన్ ముక్కు ఆనవాళ్ళు లేకుండా చేయాలని భావిస్తున్నారు. ఎక్కడో ఉన్న ‘పాకిస్తాన్ ముక్కు’కు ఏంటి సంబంధం అనేగా మీ ఆలోచన. కానీ, ఇది నిజం పాకిస్తాన్ ముక్కు పీకేయాలని ఇప్పటికే ఓ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. అదే తీర్మానాన్ని కేరళ ప్రభుత్వానికి పంపింది. ఇంతకీ ఏంటి ఈ పాకిస్తాన్ ముక్కు? ఎందుకు పీకేయాలనుకుంటున్నారు? తెలుసుకుందాం.
దేశం మొత్తం భారత-పాక్ సంబంధాల నేపథ్యంలో ఉద్వేగాల దశను ఎదుర్కుంటున్నాయి. ఇలాంటి తరుణంలో, కేరళలోని ఓ గ్రామంలోని నాలుగురోడ్ల కూడలి పేరు “పాకిస్తాన్ ముక్కు”. దీనిపై కొత్తగా చర్చ మొదలైంది. శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ప్రాంతానికి వివాదాస్పద పేరును కొనసాగించాలా? లేదా? అనే అంశంపై ఇప్పుడు అధికారిక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని కున్నత్తూరు పంచాయితీ సీపీఎం ఆధ్వర్యంలో ఉంది. భారత-పాక్ సంబంధాల ప్రభావంతో “పాకిస్తాన్ ముక్కు” అనే పేరును మార్చాలన్న ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని పంచాయతీ నిర్ణయించింది.
ఓ వార్డు సభ్యునిగా ఉన్న బీజేపీ నాయకుడి వినతిపై ఇటీవలి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. పంచాయితీ అధ్యక్షురాలు వల్సల కుమారి మీడియాతో మాట్లాడుతూ, పంచాయితీకి పేర్లు మార్చే అధికారముండదని, అందుకే ఈ అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
గ్రామ పంచాయతీలో జరిగిన చర్చ సందర్భంగా కొందరు సభ్యులు “ఇవర్కల” అనే పేరును ప్రతిపాదించారు. వాస్తవానికి ‘పాకిస్తాన్ ముక్కు’ అనే పేరు ప్రభుత్వ రికార్డుల్లో లేదు కానీ, స్థానికులు మాత్రం అదే పేరుతో ఈ ప్రాంతాన్ని పిలుస్తారని వల్సల తెలిపారు.
ఈ ప్రాంతంలో ముస్లిం కుటుంబాలు, ఒక మసీదు కూడా ఉన్నాయి. “ప్రాంతంలో అన్ని మతాల వారు, కులాల వారు ఏకముగా జీవిస్తున్నారు. ఈ పేరు మార్పు చర్చ సామరస్యాన్ని దెబ్బతీయకూడదు” అని ఆమె పేర్కొన్నారు.
ఈ ప్రాంతం కొల్లం జిల్లాలోని కున్నత్తూరు పంచాయితీ మరియు పథానంతిట్ట జిల్లా కడంబనాడు పంచాయితీల మధ్య మన్నాడి రూట్ చివర భాగంలో ఉంది. ఇదీ ‘పాకిస్తాన్ ముక్కు’ చరిత్ర. ఈ ముక్కును కేరళ ప్రభుత్వం పీకేస్తుందా? లేదా? అంశం తేలాల్సి ఉంది.