March 10, 2026

అనితమ్మా.. నన్ను అవమానిస్తున్నావ్: జేసీ సంచలన వ్యాఖ్యలు!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు తెరిస్తే సంచలనమే. కుండబద్దలు కొట్టడమే ఆయన పని. అది స్వపక్షమైనా, విపక్షమైనా తన మాటతీరులో మార్పు ఉండదు. ఈ పర్యాయం ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యంగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఆమె తనను మరియు స్థానిక ఎమ్మెల్యేను అవమానిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడామని, కానీ నేడు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కనీసం తమ గన్ లైసెన్సులను కూడా రెన్యువల్ చేయించుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి సీనియర్ నేత పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గన్ లైసెన్సుల చుట్టూ జేసీ రాజకీయ రచ్చ

తాడిపత్రిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, హోం మంత్రి అనితకు నేరుగా ప్రశ్నలు సంధించారు. తనకు, తన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఉన్న గన్ లైసెన్సుల రెన్యువల్ కోసం హోం మంత్రికి ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

“అనితమ్మా.. మరి నాది తప్పో, నీది తప్పో, పోలీసుల తప్పో తెలీదు.. కానీ ఇది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు అవమానం” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనకు గన్‌మెన్లు కూడా లేరని, భద్రత పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. సొంత పార్టీ మంత్రి ఇలా వ్యవహరించడం పట్ల జేసీ బహిరంగంగానే తన నిరసనను వ్యక్తం చేశారు.

తాడిపత్రిలో ఉద్రిక్తత.. పోలీసుల వైఖరిపై ఫైర్

మరోవైపు, తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో నెలకొన్న రాజకీయ వైరం నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరువర్గాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో పట్టణంలో హైటెన్షన్ నెలకొంది.

ఈ క్రమంలో తనకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారని, హోం మంత్రి కనీసం తన అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని జేసీ ఆరోపించారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం పటిష్టమైన పాలన అందిస్తోందని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *