
- హద్దులు మీరుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం
- తెనాలిలో వైసీపీ అధినేత జగన్
రాష్ట్రంలో రాష్ట్రపాలన అదుపు తప్పిందని, పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి ఐతానగర్ నడిరోడ్డు వద్ద ముగ్గురు యువకులపై పోలీసులు పాశవికంగా దాడిచేసిన ఘటనపై మంగళవారం జగన్ తెనాలికి చేరుకున్నారు. బాధితులు రాకేష్, విక్టర్, కరీముల్లా కుటుంబాలను పరామర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్, “కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో అమానుషత్వం పెరిగింది. ప్రజలను మోసం చేస్తూ అబద్ధపు హామీలతో మభ్యపెడుతున్నారు. ఇందుకు నిరసనగా జూన్ 4న వెన్నుపోటు దినం పాటించాలని కోరుతున్నాను. ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వ నిరంకుశతను ప్రశ్నించాలి,” అని పిలుపునిచ్చారు.
“చంద్రబాబుపై కేసులుంటే మీరూ కొడతారా?”
చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయని గుర్తు చేసిన జగన్, “అయితే ఆయనను రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టమంటారా? ఇదే ధర్మమా?” అని ప్రశ్నించారు. పోలీసులు యువకులపై అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. “సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుల్‌ను ప్రశ్నించడమే యువకుల తప్పా? ప్రశ్నించినందుకే ఏప్రిల్ 24 నుంచి 26 వరకు వారిపై చితకబాదాలా?” అని ప్రశ్నించారు.
పోలీసులు యువకులను కోర్టులో 24 గంటల్లో హాజరు పరచకుండా, హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా చట్టాన్ని లంఘించారని ఆయన ఆరోపించారు. వైద్యులు గాయాల నివేదిక ఇవ్వకపోవడం వెనుక కుట్ర ఉందని అన్నారు.
గంజాయి బ్యాచ్ అంటూ అబద్ధాలతో కుటుంబాన్ని అవమానించారు
ఇప్పుడు ఈ చెల్లి పెళ్లి పరిస్థితి.. : వైయస్ జగన్#YSJaganInTenali #TDPAntiDalit #CBNFailedCM #YSRCP #YSJagan #AndhraPradesh #YSRCPCommanders pic.twitter.com/dSEONkSJZb
— YSRCPCommanders (@YSRCPCommanders) June 3, 2025
జగన్ పర్యటనపై ఎమ్మార్పీఎస్ నిరసన
జగన్ పర్యటనకు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్, ఇతర దళిత సంఘాలు తెనాలిలో నిరసన చేపట్టాయి. మార్కెట్ సెంటర్‌లో రాస్తారోకో చేసి “జగన్ గో బ్యాక్” అంటూ నినాదాలు చేశారు. నల్లబెలూన్లు ఎగురవేస్తూ నిరసన తెలియజేశారు. ఐతానగర్, ఎర్రబడి సెంటర్‌లలో జగన్‌కు అడ్డుపడ్డ వారిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ పాలనలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను జగన్ పరామర్శించలేదని కూడా వారు విమర్శించారు.