- అవమానాలతో విసిగిపోయి ఉద్యోగానికి వీడ్కోలు
- ఢిల్లీ కార్పొరేట్‌కు మారనున్నట్లు సమాచారం
అమరావతి, జూలై 2: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన వేధింపులు ఇప్పుడు ఐపీఎస్ (IPS) అధికారులనూ హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో విసిగివేసారిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ (Siddharth Kaushal) తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా (SP-Admin) ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (VRS) కోసం దరఖాస్తు చేసుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
నెల రోజులుగా విధులకు దూరం:
సిద్ధార్థ్ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో ఆయన కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఐపీఎస్‌లపై కొనసాగుతున్న వేధింపులు:
గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టింది. డీజీ స్థాయి అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar), అదనపు డీజీ సంజయ్ (Sanjay), ఐజీ టి. కాంతి రాణా (T. Kanthi Rana), డీఐజీ విశాల్ గున్నీ (Vishal Gunni)లపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
వెయిటింగ్ లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారులలో కొందరికి చాలా నెలల తర్వాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి (Kolli Raghuram Reddy), ఎస్పీలు రవి శంకర్ రెడ్డి (Ravi Shankar Reddy), రిషాంత్ రెడ్డి (Rishanth Reddy), జాషువా (Joshua)లకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వనే లేదు. ప్రభుత్వం చెప్పినట్లా చేయలేకనే ఐజీ వినీత్ బ్రిజ్లల్ (Vineet Brijlal) కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారని పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.
వీఆర్ఎస్ వెనుక కారణం?:
ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనార్హం. పోలీసు శాఖలో పరిస్థితి చక్కబడే సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వీఆర్ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఢిల్లీలో ఒక కార్పొరేట్ కంపెనీలో (Corporate Company) చేరాలని భావిస్తున్నట్టు సమాచారం.
నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం: సిద్ధార్థ్ కౌశల్ వివరణ
భారత పోలీసు సేవ (IPS) నుంచి తన స్వచ్ఛంద రాజీనామా (voluntary resignation) గురించి ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
“నేను భారత పోలీసు సేవ నుండి స్వచ్ఛందంగా రాజీనామా చేశాను. ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాలతో, దీర్ఘకాలిక ఆలోచన తర్వాత తీసుకున్న నిర్ణయం. నా జీవన లక్ష్యాలు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఒక స్పష్టమైన నిర్ణయంగా ఇది చెప్పవచ్చు,” అని ఆయన పేర్కొన్నారు.
ఒత్తిళ్లు, వేధింపులు నిరాధారం:
ఇటీవల కొన్ని వర్గాలు తన రాజీనామాకు కారణంగా ఒత్తిళ్లు (pressures), వేధింపులు (harassment) ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. “అటువంటి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అపోహలకు గురిచేసే విధంగా ఉన్నాయని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. నా రాజీనామా స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, ఎటువంటి బలవంతం లేకుండానే తీసుకున్న నిర్ణయం,” అని ఆయన స్పష్టం చేశారు.
ఐపీఎస్ సేవలో పని చేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన, తృప్తికరమైన అనుభవం అని ఆయన తెలిపారు. తాను పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడూ తన ఇంటిలా భావించానని, ఈ రాష్ట్ర ప్రజలపై తనకు ఎనలేని ప్రేమ, గౌరవం ఉన్నాయని పేర్కొన్నారు.
చివరగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తనపై అధికారులకు, సహచర అధికారులకు, ఉద్యోగులతో పాటు తనను ఆదరించిన ప్రజలందరికీ సిద్ధార్థ్ కౌశల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి జీవితాన్ని కొత్త దారిలో, కొత్త లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నానని, సమాజానికి మరో విధంగా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని ఆయన ప్రకటించారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.