బోటులో విహారం అంటేనే మనసు ఎంతో విలాసంగా ఉత్సాహంగా కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా ఆ బోటులో ప్రయాణిస్తూ సాయం సమయంలో అక్కడే అల్పాహారం ఆరగిస్తే ఎలా ఉంటుంది? మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. పని ఒత్తిడిలో సతమతమవుతున్న వారికి గోదావరి నదిపై విహరించడానికి ఇంతకంటే అద్భుతమైన అవకాశం మరొకటి ఉంటుందా? ఈ అవకాశాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరిలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలోని బ్రిడ్జిలంక వద్ద ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ఆదివారం ప్రారంభించారు.
స్థానిక పద్మావతి ఘాట్ సమీపంలోని టూరిజం కంట్రోల్ రూమ్ నుంచి బోటులో పయనించి.. గోదావరి మధ్యలోని ఇసుక తిప్పలను ఆనుకుని నీటిలో తేలియాడుతున్న ఈ రెస్టారెంట్ వద్దకు చేరుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇది ఉంటుంది. ఇక్కడ వెజ్, నాన్‌వెజ్ రకాలు అందుబాటులో ఉంటాయి. రెస్టారెంట్‌లో 170 మంది వరకు కూర్చునేలా సిట్టింగ్ సామర్థ్యం ఉంది.
సిల్వర్ స్పూన్, ఆహ్వానం కిచెన్ ప్రాంచైజీస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ అండ్ మెయింట్‌నెన్స్ విధానంలో ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. దీని కోసం టూరిజం శాఖకు ఏడాదికి రూ.6.5 లక్షల ఆదాయం ఇవ్వనున్నారు.
ఒత్తిడిని ఫీలయ్యాయి ఎవరైనా కాసేపు అలా గోదావరి నదిపై విహరిస్తే హాయిగా ఉంటుంది.