నేటి క్రిస్మస్ బరిలో 8 విభిన్న చిత్రాలు
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గురువారం థియేటర్లలో (Christmas Movie Releases) పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈసారి బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి లేకపోయినా, మొత్తం ఎనిమిది విభిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ క్రిస్మస్‌కు ఆరు (Telugu Movies) తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. తెలుగు సినిమాల జాబితాలో ‘ఛాంపియన్’, ‘శంబాల’, ‘దండోరా’, ‘ఈషా’, ‘పతంగ్’, ‘బ్యాడ్ గాళ్స్’ ఉన్నాయి. అలాగే ‘వృషభ’, ‘మార్క్’ అనే రెండు డబ్బింగ్ సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. ఈ చిత్రాల్లో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థల సపోర్టుతో థియేటర్లలోకి వస్తుండటం గమనార్హం.
ఛాంపియన్ :
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాను ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. అనస్వర రాజన్ కథానాయిక. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, ఫుట్‌బాల్ నేపథ్యంలో స్వాతంత్య్రానంతర హైదరాబాద్ రాష్ట్ర కథతో రూపొందింది.
శంబాల :
ఆది సాయికుమార్ కెరీర్‌లో కీలక చిత్రంగా భావిస్తున్న ‘శంబాల’ను యుగంధర్ ముని తెరకెక్కించారు. అర్చన అయ్యర్ హీరోయిన్. సస్పెన్స్, మిస్టరీ, ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రంపై యూనిట్ విస్తృత ప్రచారం నిర్వహించింది.
దండోరా :
శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మురళీకాంత్ దర్శకత్వం వహించారు. సామాజిక అంశాలతో కూడిన ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఈషా :
అఖిల్‌రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్ నటించిన ఈ హారర్ థ్రిల్లర్‌ను శ్రీనివాస్ మన్నె తెరకెక్కించారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
పతంగ్ :
ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ప్రణీత్ ప్రత్తిపాటి తెరకెక్కించారు. గౌతమ్ మీనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
బ్యాడ్ గాళ్స్ :
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ ఫణి ప్రదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రేణు దేశారు కీలక పాత్రలో నటించారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన సూర్య ప్రధాన పాత్రలు పోషించారు.
వృషభ :
మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతోంది. తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మార్క్ :
కిచ్చా సుదీప్ నటించిన ‘మార్క్’ అనే క్రైమ్ యాక్షన్ డ్రామా కూడా గురువారంనాడు విడుదల కానుంది.
ఈ క్రిస్మస్‌కు (Box Office Clash) బాక్సాఫీస్ వద్ద ఎనిమిది సినిమాలు పోటీ పడుతూ ప్రేక్షకులను అలరించనున్నాయి.