అన్ని విద్యల్లోకన్నా వేద విద్య ఉన్నతమైనది కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో బుధవారం సాయంత్రం ఆయన వేద విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ వేద విద్యార్థులు ధర్మ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
వేదాలు అభ్యసించే విద్యార్థులకు స్వరూపం, స్వధర్మం, స్వభావం ముఖ్యమని చెప్పారు. ధర్మాన్ని తెలుసుకోవాలంటే వేదాలను తెలుసుకోవడం తప్పనిసరి అన్నారు. భారతదేశం సాధువులు, మహర్షులతో నడపబడుతున్న దేశమని తెలియజేశారు. మనం ధర్మం కోసం త్యాగం చేయాలి గానీ ధర్మాన్ని త్యాగం చేయకూడదని పేర్కొన్నారు.
వేదాల్లోని భావార్థం విస్తృతంగా ప్రచారం చేసినప్పుడే భావి తరాలకు మంచి జరుగుతుందని చెప్పారు. ధర్మ పరిరక్షణకు ఆహార, ఆలోచన నియామాలు పాటించాలని తెలిపారు. విద్యార్థులందరూ వేద విద్య పూర్తయ్యాక ధర్మానికి కార్యకర్తలుగా పనిచేసి సంస్కృత భాషను ప్రచారం చేయాలని సూచించారు.
మన దేశానికి ధర్మం, ఆలయం, సంస్కృతి, ఆచారం ముఖ్యమని ఉపదేశించారు. దేశంలోని ప్రతి గ్రామంలో ఉన్న ఆలయాలను తిరుమల ఆలయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీటీడీ చేస్తున్న అనేక కార్యక్రమాల్లో వేద విజ్ఞాన అభివృద్ధి కార్యక్రమం చాలా గొప్పదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, ధర్మగిరి ప్రత్యేక అధికారిణి మతి విజయ లక్ష్మీ, అధ్యాపకులు, విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.