- వివిధ రంగాల నిపుణులతో శ్రీవారి సేవ
- డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ జె.శ్యామలరావు
టీటీడీలో మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీటీడీ ఈవో వెల్లడించారు.
వేసవి నేపథ్యంలో తిరుమల, టీటీడీ స్థానికాలయాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టాం.భక్తులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, కూల్ పెయింట్, నిరంతరాయంగా నీటిని పిచికారి చేస్తున్నాం.
రద్దీ ప్రాంతాల్లో, క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగ విరివిగా పంపిణీ చేస్తున్నాం.తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో దర్శన టోకెన్ల కోసం వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలో మరింత పటిష్టంగా శ్రీవారి సేవను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాం.
వివిధ రంగాల నిపుణుల సేవలును వినియోగించుకునేందుకు వీలుగా కార్యచరణ సిద్ధం చేస్తున్నాం. ఎన్ఆర్ఐ సేవలు శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.
వీటితో పాటు గోమాతలకు సేవ చేసేందుకు ‘గోసేవ’ను అందుబాటులోకి తీసుకురానున్నాం.
గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశలవారీగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
తిరుమలలో తిరునామధారణ కార్యక్రమాన్ని పునరుద్ధరించాం. శ్రీవారి సేవకులతో తిరుమలలోని 18 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది.
తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ పట్టణ ప్రణాళిక శాఖను ఏర్పాటు చేశాం.ఇటీవలే పలు పోస్టుల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్ఛర్ కన్సెల్టెన్సీల ద్వారా టీటీడీలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు చేపట్టాం.
తిరుమలలోని 45 విశ్రాంత భవనాల పేర్లు మార్పునకు 75 ఆధ్యాత్మిక పేర్లను టీటీడీ ఎంపిక చేసింది. ఇందులో 42 మంది టీటీడీ సూచించిన పేర్లను మార్పు చేశారు. ఇదివరకే 33 కాటేజీలకు వివిధ దేవతల పేర్లు కలిగిఉన్నాయి. మిగిలిన రెండు విశ్రాంతి గృహాలు స్పందించలేదు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేసేందుకు, ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించేందుకు బోర్డు నిర్ణయించింది.
ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు టీటీడీలో ప్రక్షాళన చేపట్టాం. భక్తులకు దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదంలో సమూల మార్పులు తీసుకొచ్చాం. తిరుమల అటవీ ప్రాంతంలో 68 శాతం నుండి 80 శాతానికి పచ్చదనాన్ని పెంపొందించేందకు చర్యలు చేపట్టాం.
శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలు నిర్మించేందుకు 26.09.2014లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం జరిగింది. ఇటీవల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ మిగిలిన నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 15 రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడం జరిగింది. వారి ఆమోదం మేరకు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాల నిర్మాణం చేపడతాం.
టీటీడీ తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రకారం అన్యమతస్తులపై చర్యలు చేపట్టాం. ఇప్పటికే టీటీడీలో ఉన్న 29 మంది అన్యమత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చేందుకు టీటీడీ బోర్డు కూడా ఆమోదం తెలిపింది.
ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దుచేసి, ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీని టీటీడీ నియమించింది.
భక్తులకు మరింత నాణ్యంగా, రుచికరంగా ఆహార పదార్థాలు అందించేందుకు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించాం. ఆదాయంతో సంబంధం లేకుండా నిర్వాహకుల సామర్థ్యాన్ని బట్టి, పేరొందిన సంస్థలకు కేటాయించడానికి త్వరలోనే టెండర్లను పిలుస్తాం.
సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మరింత పారదర్శకంగా, సులభతరంగా, త్వరితగతిన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, FMS MONITORING, WHATSAPP GOVERNANCE , గూగుల్ తో ఒప్పందం, ఆధార్ నమోదు, కియోస్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఫీడ్ బ్యాక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ విధానం ద్వారా పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది.
తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెల్లిన వసతి గృహాల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.
టీటీడీ భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. తిరుమలలో 12వేల చదరపు అడుగుల స్థలంలో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. టీటీడీలో అన్నప్రసాదాల తయారీకి ఉపయోగించే పప్పు దినుసుల నాణ్యత పెంచేందుకు నిపుణుల సహకారం తీసుకుంటున్నాం. ఇందుకోసం రిలయన్స్ రీటైల్ సంస్థ ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు రావడంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.
టీటీడీ గోశాలలో గోసంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గోవులు, లేగ దూడలకు రోజువారీ అందిస్తున్న నాణ్యమైన దాణా, పశుగ్రాసం అందించేందుకు చర్యలు చేపట్టాం.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీఈ శ్రీ టీ.వీ.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.