నారావారిపల్లె ప్రగతి పథం
- క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన భవనాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం
తిరుపతి జిల్లా నారావారిపల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే ‘స్వర్ణ నారావారిపల్లె’ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యేక అధికారి సుశీలా దేవితో కలిసి పర్యటించిన ఆయన, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం, అనిమల్ హాస్టల్, విద్యుత్ సబ్ స్టేషన్ మరియు రంగంపేట మోడల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మరియు ఈ-సంజీవిని ప్రాజెక్టు పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
గ్రామంలో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ భవనం యువతకు ఉపాధి మార్గాలను చూపేలా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే సిమెంట్ రోడ్డు పనులను, మూలపల్లి చెరువు అభివృద్ధిని ఆయన పర్యవేక్షించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని, గడువులోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. టాటా డీఐఎన్‌సీ (DINC) వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అధికారుల సమన్వయంతో మోడల్ విలేజ్ నిర్మాణం
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి, పశుసంవర్ధక శాఖ జేడీ, డీఎంహెచ్‌ఓ తదితర అధికారులతో కలిసి ఆయన రంగంపేట మోడల్ స్కూల్ మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. విద్య, వైద్యం మరియు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే గ్రామంలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని విద్యుత్ శాఖాధికారులతో చర్చించారు.
గ్రామ సచివాలయ సిబ్బంది మరియు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీ ప్రసాద్ రావు, ఇరిగేషన్ మరియు పంచాయతీ రాజ్ ఎస్‌ఈలు మధుసూదన్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం, చంద్రగిరి తహసిల్దార్ శివరాం సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా తీసుకున్న స్వర్ణ నారావారిపల్లె పనులు ముగింపు దశకు చేరుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#Naravaripalle #TirupatiCollector #VillageDevelopment #APProgress #SmartVillage
