April 4, 2026

అమరావతి నిర్మాణం: చంద్రబాబు సీరియస్

CM REVIEW

CM REVIEW

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులను కేవలం ఒక ‘కాంట్రాక్ట్ వర్క్’లా చూడొద్దని, చరిత్రలో భాగస్వాములు అవుతున్నామనే బాధ్యతతో పనిచేయాలని నిర్మాణ సంస్థలకు స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి, ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేయడమే లక్ష్యమని సీఎం ప్రకటించారు. పనుల్లో జాప్యాన్ని ఏమాత్రం సహించబోమని, మ్యాన్ పవర్ మరియు మెషినరీని యుద్ధ ప్రాతిపదికన పెంచాలని ఆదేశించారు.

రాజధానిలో ప్రస్తుతం రూ. 57,821 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉండగా, సుమారు 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, లక్ష్యాల మేరకు పనులు సాగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారానికి రూ. 941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాలని, వర్షాకాలం రాకముందే కీలక దశలను అధిగమించాలని సూచించారు. నిధుల కొరత లేదని, కాంట్రాక్టు సంస్థలు సమర్థులైన ప్రాజెక్ట్ మేనేజర్లను నియమించుకుని నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

పల్లెల్లో ఇకపై ప్రత్యేక పాలన ఈ వార్తను కూడా చదవండి

నిర్మాణ సామాగ్రి సరఫరాలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇసుక, గ్రావెల్ రవాణా కోసం ‘గ్రీన్ ఛానెల్’ ఏర్పాటు చేయాలని, అటవీ శాఖ లేదా ఇతర అధికారుల వల్ల జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ విషయంలో సమన్వయం కోసం గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

రాజధాని ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సామాగ్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా కాంట్రాక్ట్ సంస్థలదేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు, కుట్రలు పన్నేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి సమయంలో ఏమరుపాటుగా ఉండవద్దని అధికారులను, సంస్థలను హెచ్చరించారు. భద్రతా పరమైన లోపాలు తలెత్తితే సహించేది లేదని, ప్రతి అంశాన్ని పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

#Amaravati #ChandrababuNaidu #APCapital #AndhraPradesh #BuildingTheFuture #CRDA #APGrowth #CapitalCity

పల్లెల్లో ఇకపై ప్రత్యేక పాలన ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *