రాష్ట్ర స్థాయిలో చిత్తూరుకు తొలి స్థానం.. ఎందుకంటే?
శ్రీ వివేకానంద స్వామి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు ఈ నెల 19న గుంటూరులోని కె.ఎల్. యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ పోటీల్లో చిత్తూరు జిల్లా నుంచి జానపద నృత్యం (గ్రూప్) విభాగంలో పవన్ గ్రూప్ పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచింది. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఈ బృందం, అక్కడ కూడా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని చిత్తూరు జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి జాతీయ యువజనోత్సవాలకు అర్హత పొందిన పవన్ గ్రూప్ సభ్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు. యువత తమ ప్రతిభతో జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం ఆనందకరమని పేర్కొన్నారు. అలాగే డిసెంబరు 20న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ విజేతలకు జ్ఞాపికలు అందించి సత్కరించారు.
రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలిచిన పవన్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ తరఫున 2026 జనవరి 12న న్యూఢిల్లీలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొననుంది. ఈ విజయం చిత్తూరు జిల్లా యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అధికారులు తెలిపారు.