టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులతో సాన్నిహిత్యం ప్రదర్శించే వారిని, వారితో కలిసి శుభకార్యాలకు వెళ్లే వారిని ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
“సిగ్గు, లజ్జ, మానవత్వం ఉంటే వైసీపీ వాళ్లతో మాట్లాడకూడదు.. అటువంటి వాళ్లను ఒంగోబెట్టి తన్నేస్తాను” అంటూ ఆయన చేసిన దబాయింపుపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పార్టీ పట్ల విధేయత లేని వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
సిగ్గులేకుండా వైసీపీ వాళ్లతో తిరుగుతారా?
ఆదివారం నర్సీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ, కొంతమంది టీడీపీ కార్యకర్తల తీరుపై మండిపడ్డారు. “ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైసీపీ నాయకులతో ఇప్పుడు సిగ్గులేకుండా కొందరు మాట్లాడుతున్నారు.
వాళ్లతో కలిసి ఫోటోలు దిగుతూ, విందు వినోదాల్లో పాల్గొనడం దారుణం. అలాంటి వారి పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాను” అంటూ అత్యంత ఘాటుగా స్పందించారు.
పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన నిజమైన కార్యకర్తలకు ఇది అవమానమని, ఇలాంటి ‘డబుల్ గేమ్’ ఆడే నేతలకు తమ పార్టీలో చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ వర్గాల్లో కలకలం
చింతకాయల విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కూడా చర్చకు దారితీశాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం అందరినీ కలుపుకుని పోవాలని చూస్తుంటే, విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కొందరు భావిస్తున్నారు.
అయితే, వైసీపీ అరాచకాలను భరించిన కార్యకర్తల ఆవేదననే విజయ్ ఇలా వ్యక్తం చేశారని ఆయన అనుచరులు సమర్థిస్తున్నారు. గతంలో కూడా విజయ్ తన దూకుడు ప్రసంగాలతో పలుమార్లు వార్తల్లో నిలిచారు.
ముఖ్యంగా అనకాపల్లి, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు ఆయన ఇలాంటి తీవ్రమైన పదజాలం వాడుతుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
