ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణలో జాప్యం చేస్తున్న ప్రాసిక్యూషన్ తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ ఉత్తర్వులను (Interim Order) ఖరారు (Absolute) చేసింది.
కేసులో తగినంత మెరిట్ లేదని, కేవలం విచారణను కాలయాపన చేసేందుకే ప్రాసిక్యూషన్ పదేపదే సమయం కోరుతోందని ధర్మాసనం మండిపడింది. దీంతో ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు మోహిత్ రెడ్డికి అరెస్ట్ నుండి పూర్తి రక్షణ లభించింది.
ప్రాసిక్యూషన్ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పటికే సమాధానం (Counter) దాఖలు చేయడానికి నెలల తరబడి సమయం తీసుకున్న ప్రాసిక్యూషన్, ఇప్పుడు అదనంగా మరో మూడు నెలల సమయం కోరడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కూడా “ఇంకా పరిశీలించాల్సిన అంశాలు ఉన్నాయి” అని చెప్పడం విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. “మైదానంలో క్రీడాకారుడు ఎలాగైతే ఆటను సాగదీయాలని చూస్తాడో, ఇక్కడ ప్రాసిక్యూషన్ కూడా అదే పద్ధతిని అవలంబిస్తోంది” అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.
తుది తీర్పు వరకు అరెస్ట్ లేదు
మోహిత్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను రెగ్యులర్ కోర్సులో లిస్ట్ చేయాలని ఆదేశించింది. సాధారణంగా ఇటువంటి కేసులు తుది విచారణకు రావడానికి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. అప్పటి వరకు మోహిత్ రెడ్డికి గతంలో మంజూరైన ముందస్తు బెయిల్ నిబంధనలే కొనసాగుతాయి.
తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటుండగా, కుమారుడు మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో లభించిన ఈ ఊరట ఆ కుటుంబానికి మరియు వైసీపీ శ్రేణులకు పెద్ద ఊరటగా మారింది.
