April 4, 2026

అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బొత్స

BOTSA SATYA NARAYANA

BOTSA SATYA NARAYANA

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లలో అమరావతిలో జరిగిన అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి, కేవలం అమరావతిపైనే దృష్టి సారించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో నిర్మించిన కాంక్రీట్ కట్టడాలు ఎక్కడ ఉన్నాయని బొత్స ప్రశ్నించారు. “కనీసం మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లను కూడా పూర్తి చేయలేకపోయారు, కరకట్ట రోడ్డు వేయడానికి కూడా దిక్కులేదు. కేవలం ఏదో జరుగుతోందని భ్రమ కలిగించడానికి చంద్రబాబు తాపత్రయపడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ లేవనెత్తిన సందేహాలనే తాము కూడా వ్యక్తం చేస్తున్నామని, గత రెండేళ్లలో ఎంత ఖర్చు చేశారు, ఎంత పేమెంట్ ఇచ్చారనే వివరాలను బయటపెట్టాలని కోరారు.

పల్లెటూరి బిడ్డల నుంచి సైనికుల వరకు.. లోకేష్ స్ఫూర్తిదాయక ప్రసంగం! ఈ వార్తను కూడా చదవండి

రాష్ట్ర విభజన హామీ అయిన ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని బొత్స ఆరోపించారు. “ప్రత్యేక హోదా వస్తే 10 అమరావతిలు వస్తాయి, ముంబై వంటి నగరాలు నిర్మితమవుతాయి. కానీ చంద్రబాబు కేంద్రం వద్ద ఈ విషయం ఎందుకు ప్రస్తావించడం లేదు?” అని నిలదీశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించి, రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధిస్తే తామే చంద్రబాబును మెచ్చుకుంటామని సవాల్ విసిరారు.

ప్రభుత్వం కేవలం అమరావతి జపం చేస్తూ రైతుల గిట్టుబాటు ధరలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కీలక అంశాలను విస్మరించిందని బొత్స విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారని, రాష్ట్రంలో కల్తీ మామిడి పండ్లు విక్రయించే దుస్థితి నెలకొన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన అగ్నిప్రమాదానికి వైఎస్సార్‌సీపీని ముడిపెట్టడం హాస్యాస్పదమని, ఆ ఘటనపై విచారణ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.

#BotsaSatyanarayana #Amaravati #SpecialStatusForAP #AndhraPradesh #YSRCP #TDP #APPolitics #PressMeet

పల్లెటూరి బిడ్డల నుంచి సైనికుల వరకు.. లోకేష్ స్ఫూర్తిదాయక ప్రసంగం! ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *