March 15, 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: బీజేపీ వైఫల్యానికి కారణాలేంటి?

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి (BJP) మింగుడు పడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించి, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కాషాయ పార్టీ.. క్షేత్రస్థాయిలో జరిగిన ఈ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది.  అధికార కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోగా, బీఆర్ఎస్ కూడా ఉనికిని చాటుకుంది. అయితే, తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీకి ఈ ఫలితాలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోవడంపై పార్టీ అగ్రనాయకత్వం పునరాలోచనలో పడింది. ముఖ్యంగా పట్టణ ఓటర్లు బీజేపీ వైపు ఉంటారన్న నమ్మకం ఈసారి వమ్మయ్యింది. పార్టీ వైఫల్యానికి గల కారణాలేంటి? ఎక్కడ వైఫల్యం. లోక్ సభలో సీట్లు వాపు తప్ప క్షేత్రస్థాయిలో బలుపు కాదా? బీజేపీకి బలమైన పునాదులు లేవా? కమలనాథులను తొలిచేస్తున్న ప్రశ్నలివి.


క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం

బీజేపీ పేరు చెబితే తెలుగు రాష్ట్రాలలో జడచుకునే పరిస్థితి ఉంది. తెలంగాణలో అధికారంలో లేకపోయినా అక్కడి నాయకుల బిల్డప్ మామూలుగా ఉండదు. కానీ, స్థానిక ఎన్నికలలో వారు బిల్డ్ బాబాయిలేనా? అనే స్థాయికి దిగజారిపోయింది పరిస్థితి. ఒక కిషన్ రెడ్డి. ఒక బండి సంజయ్.. ఒక ధర్మపురి.. ఒక లక్ష్మణ్.. ఒక మాధవి.. ఒక రాజేంద్రుడు.. ఒక రామచంద్రుడు.. తమ వాగ్దాటితో అదర గొట్టేస్తారు. ఎదుటి పార్టీ నాయకులను బెదరగొట్టేస్తారు. కానీ, క్షేత్ర స్థాయి ఎన్నికల ఫలితాలు చూస్తే, సీన్ మరోలా కనిపిస్తోంది. పరిమిత ఫలితాలు…  ప్రధాన కారణం పార్టీ అంతర్గత కుమ్ములాటలు మరియు సమన్వయ లోపం. అసెంబ్లీ ఎన్నికల నాటి నుండే పార్టీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. ఒకవైపు పాత నేతలు, మరోవైపు ఇతర పార్టీల నుండి చేరిన నేతల మధ్య పొసగకపోవడం వల్ల మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది. చాలా చోట్ల అసంతృప్త నేతలు రెబల్స్‌గా పోటీ చేయడం పార్టీ ఓట్లను భారీగా చీల్చింది. అంతేకాకుండా, రాష్ట్ర నాయకత్వం కేవలం ప్రధాని మోదీ ఇమేజ్‌పైనే ఆధారపడి ఎన్నికలకు వెళ్ళడం, స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడం బీజేపీకి నష్టం చేకూర్చింది.

దీని పర్యావసానంగా, కింది స్థాయి కేడర్‌లో నిరాశ నెలకొంది. ఎన్నికల మేనేజ్‌మెంట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలను బీజేపీ ఎదుర్కోలేకపోయింది. అభ్యర్థుల ఎంపికలో స్థానికంగా పట్టున్న నేతలను కాదని, పైస్థాయి నుండి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గడం కూడా పరాజయానికి దారితీసింది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న బలం ఈసారి ఓట్ల రూపంలో మలచడంలో నాయకత్వం విఫలమైంది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బలపడిన కాంగ్రెస్ – బీజేపీకి తప్పిన అనుకూల పవనాలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఓటర్లపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లు, నిరుద్యోగులను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలు, గ్యాస్ సిలిండర్ ధరల ప్రభావం పట్టణ మధ్యతరగతి ఓటర్లను బీజేపీకి దూరం చేసింది. బీజేపీకి పెట్టని కోటగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి ఓటర్లు ప్రత్యామ్నాయం వైపు చూశారు. అభివృద్ధి మంత్రం కంటే స్థానిక సమస్యలే ఎన్నికల్లో కీలకంగా మారాయి.

బీజేపీ తన సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోయింది. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థుల పనితీరు, వారి అందుబాటు అనేది ముఖ్యం. కానీ, బీజేపీ అభ్యర్థులు కేవలం జాతీయ అంశాలను ప్రస్తావించడం ఓటర్లకు కనెక్ట్ కాలేదు. గల్లీ ఎన్నికల్లో ఢిల్లీ అంశాలు పనిచేయవని ఈ ఫలితాలు నిరూపించాయి. మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, రోడ్లు, నీటి సమస్యల కంటే హిందుత్వ ఎజెండాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా కొన్ని వర్గాల ఓటర్లను దూరం చేసింది. సామాన్య జనాన్ని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా మేలుకొలిపే ప్రణాళికలు బీజేపీ మ్యానిఫెస్టోలో కొరవడటం విమర్శలకు తావిస్తోంది.

భవిష్యత్తు సవాళ్లు – పార్టీ పునర్నిర్మాణం అవసరమా?

వ్యూహాత్మక కోణంలో విశ్లేషిస్తే, బీజేపీ ఇప్పుడు ‘ఆపరేషన్ తెలంగాణ’ను పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీలో మేజర్ సర్జరీ తప్పదని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు లేదా కార్యవర్గంలో మార్పుల ద్వారా కేడర్‌లో ఉత్సాహం నింపాలని అధిష్ఠానం భావిస్తోంది. బీఆర్ఎస్ బలహీనపడితే ఆ ఓట్లు తమకే వస్తాయని బీజేపీ భావించింది, కానీ కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేయడం బీజేపీకి పెద్ద సవాలుగా మారింది.

#BJPFailureTelangana #TelanganaMunicipalPolls #TSPolitics2026 #CongressVictoryTS #MunicipalElectionResults #BJPInternalCrisis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *