బంగ్లాదేశ్‌లో అరాచక శక్తులు మరోసారి పడగవిప్పాయి. రాజకీయ కక్షల మంటల్లో ఒక పసి ప్రాణం బలైపోయింది. మానవత్వాన్ని మంటగలుపుతూ జరిగిన ఈ ఘటన సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
లక్ష్మీపూర్: బంగ్లాదేశ్‌లో హింసాకాండ పరాకాష్టకు చేరుకుంది. రాజకీయ వైరం పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటోంది. లక్ష్మీపూర్ జిల్లాలో జరిగిన ఒక అమానుష ఘటనలో, బీఎన్‌పీ (BNP) నేత నివాసానికి నిప్పు పెట్టిన దుండగులు.. ఆయన ఏడేళ్ల కుమార్తెను సజీవ దహనం చేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కుమార్తెలు, తండ్రి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఏం జరిగింది?
స్థానిక సమాచారం ప్రకారం.. భవానిగంజ్ యూనియన్ బీఎన్‌పీ సహాయ ఆర్గనైజింగ్ సెక్రటరీ, వ్యాపారవేత్త బేలాల్ హొస్సేన్ నివాసమే లక్ష్యంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగింది. కుటుంబ సభ్యులంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో దుండగులు ఇంటికి చేరుకున్నారు. వారు చేసిన పని వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రాకుండా ఇంటికి ఉన్న రెండు ప్రధాన ద్వారాలను బయట నుంచి తాళం వేశారు. ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
తల్లి కళ్లముందే కాలిపోయిన చిన్నారి
మంటలు చెలరేగడంతో మేల్కొన్న బేలాల్ తల్లి హేజరా బేగం, కిటికీలోంచి తన కుమారుడి ఇల్లు తగులబడుతుండటం చూసి కేకలు వేస్తూ పరుగెత్తారు. కానీ బయట నుంచి తాళం వేసి ఉండటంతో ఆమె లోపలికి వెళ్లలేకపోయారు. తీవ్ర ప్రయత్నం తర్వాత బేలాల్ తలుపులు బద్దలు కొట్టి తన భార్య నజ్మా, నాలుగు నెలల పసికందు అబీర్, ఆరేళ్ల కుమారుడు హబీబ్‌ను రక్షించి బయటకు తీసుకువచ్చారు.
కానీ మరో గదిలో నిద్రపోతున్న ముగ్గురు కుమార్తెలను కాపాడటం సాధ్యం కాలేదు. ఏడేళ్ల చిన్నారి అయేషా అక్తర్ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె అక్కలు సల్మా అక్తర్ (16), సమియా అక్తర్ (14)లు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం బేలాల్‌తో పాటు అతని ఇద్దరు కుమార్తెల పరిస్థితి విషమంగా ఉంది. వారి శరీరాలు 60 శాతానికి పైగా కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు.
హింసకు నేపథ్యం
స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. హదీ మృతికి నిరసనగా పలుచోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బీఎన్‌పీ నేత ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమవుతోందని, రాజకీయ ప్రతీకార దాడులు పెరిగిపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక పక్క రాజకీయ పోరాటాలు, మరోపక్క మతపరమైన హింసతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఏ తప్పూ ఎరుగని చిన్నారి అయేషా మృతి.. ఆ దేశంలో నెలకొన్న అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది.