
బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. దేశ రాజకీయాలను ఉగ్రవాదుల చేతుల్లో పెట్టేశారని మాజీ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరిగారు. జాతీయ విలువల్ని తాకట్టు పెట్టి అధికారంలో ఉండాలని భావించే వారు దేశభక్తులు కాదంటూ ఆమె వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ ప్రకంపనలకు దారి తీశాయి. నోబుల్ బహుమతి అందుకున్న ముహమ్మద్ యూనుసే దేశాన్ని అమెరికాకి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని, ఆయన ప్రభుత్వం ఉగ్రవాదుల మద్దతుతో నడుస్తోందని, ఆయన ఉగ్రవాద నేతగా తయారయ్యారని ఆమె ఆరోపించారు.
ఇటీవల ఆర్మీ డిసెంబర్లో ఎన్నికలకు పిలుపునివ్వడంతో యూనుసు రాజీనామాకు సిద్ధమయ్యాడన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు మళ్లీ రాజుకున్నాయి.
తన తండ్రి అమెరికా కోరినప్పటికీ సెయింట్ మార్టిన్స్ దీవిని ఇవ్వలేదని, అందుకే తన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. కానీ ఇప్పుడేమైంది? దేశం ప్రేమించిన యూనుసే అధికారంలోకి వచ్చాక మారిపోయాడని, తామెప్పుడూ దేశాన్ని అమ్ముకోవాలని ఆలోచించలేదని అన్నారు. కానీ దేశాన్ని ముప్పతిప్పల పెట్టినవాడే అధికారం చేపట్టాడని మండిపడ్డారు. ఫేస్ బుక్ పోస్టులో ఈ ఆరోణలు చేశారు.
ఉగ్రవాదుల చేతుల్లో ప్రభుత్వం
యూనుసు ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని కైవసం చేసుకున్నారని, అంతర్జాతీయంగా నిషేధితులైన వారి నుంచి కూడా ఆయన మద్దతు పొందుతున్నారు. ఒక ఉగ్రదాడి జరిగిన తరువాతే తాము కఠిన చర్యలు తీసుకున్నామని,కానీ ఇప్పుడు జైలులు ఖాళీగా ఉన్నాయని, అందర్నీ విడుదల చేశారని, ఇప్పుడు దేశాన్ని మిలిటెంట్ల రాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆవామీ లీగ్‌పై నిషేధం — రాజ్యాంగవ్యతిరేకం
బంగ్లా జాతి రాజ్యాంగం విమోచన పోరాట ఫలితం.. ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కు యూనుసుకి లేదు. ప్రజల మద్దతు లేకుండా అధికారంలోకి వచ్చిన ఆయనకు రాజ్యాంగంలో ఎటువంటి స్థానం లేదన్నారు. చీఫ్ అడ్వైజర్ పదవికి న్యాయబద్ధత లేదని, పార్లమెంట్ లేకుండా ఆయన నిబంధనలు ఎలా మార్చగలరని ప్రశ్నించారు. ఇది అసాధారణమని, తన పార్టీ ఆవామీ లీగ్‌ను నిషేధించడం పూర్తిగా చట్టవ్యతిరేకమని హసీన వ్యాఖ్యానించారు.