
- బద్రినాథ్ హైవేపై భీకర ట్రాఫిక్ జామ్
- ఉత్తరాఖండ్ భారీ వర్షాలతో హైవే పై విధ్వంసం
- ధారి దేవి నుంచి ఖాంక్రా వరకు 6 కిలోమీటర్ల ట్రాఫిక్ ముట్టడి
పర్వత ప్రాంతాల్లో పర్యాటక కాలం మొదలైన వేళ… స్వర్గాన్ని తలపించే ఉత్తరా ఖండ్‌కి వర్షాలు విఘ్నం అవుతున్నాయి. దేవభూమిగా ప్రసిద్ధి గాంచిన ఈ ప్రాంతాన్ని వరుణదేవుడు ముంచెత్తుతుండగా, దాని దుష్పరిణామాలు బద్రినాథ్ హైవేపై తీవ్రంగా కనిపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి రోడ్లపైకి దిగి రావడంతో ధారి దేవి ఆలయం నుంచి ఖాంక్రా వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల పాటు జాతీయ రహదారి 7 (NH-7) పై వాహనాలు నిలిచిపోయాయి.
మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఈ మార్గంపై అసాధారణంగా భారీ ట్రాఫిక్ ఉందని వెల్లడించింది. రుషికేశ్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, చమోలి, జోషిమఠ్, బద్రినాథ్ వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ వెళ్లే ఈ ప్రధాన మార్గంలో భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలకానంద నదికి ఆనుకుని ఉన్న ధారి దేవి ఆలయం, శ్రీనగర్ (ఉత్తరాఖండ్) మరియు రుద్రప్రయాగ్ మధ్యలో ఉంది. ఈ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో మురికి, బండరాళ్ల గుట్టలు రోడ్డుపై పేరుకుపోయాయి. అందువల్ల కార్లు, ట్రావెలర్స్, ట్రక్కులు తదితర వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి.
సమాజ మాధ్యమాల్లో ప్రయాణికులు పోస్టు చేసిన ఫోటోలలో JCB యంత్రాలు బిజీగా రోడ్డును శుభ్రం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వర్షాలు మరింత కురిసే సూచనలతో పరిస్థితి గందరగోళంగా మారే ప్రమాదం ఉంది.
ఇతర ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికలు: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వడగండ్ల వర్షాలు పడే అవకాశముండగా, రాజస్థాన్‌లో తూర్పు మరియు పశ్చిమ జిల్లాల్లో ధూళి తుఫాన్లు మే 27 వరకు వీచనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.