చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అంటారా?
– వైసీపీకి కనీస అవగాహన కూడా లేదు
– ఇందాపూర్,హెరిటేజ్‌కు సంబంధం లేదు… కావాలనే బద్నాం చేసే కుట్ర
– ఆర్థిక మూలాలపై దాడి చేయడం వైసీపీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనం
– హెరిటేజ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం, ఆధారాలుంటే చూపాలని మండలిలో సవాలు విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు
– ప్రతిరోజూ ఒకే అంశంతో వైసీపీ సభా సమయాన్ని వృథా చేస్తోంది – మంత్రి అచ్చెన్న తీవ్ర ఆగ్రహం
అమరావతి, ఫిబ్రవరి 19: శాసనమండలిలో వైసీపీ సభ్యుల వ్యవహారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతో వైసీపీ సభ్యులు ఆందోళనలు చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు ఎక్కడా ఎలాంటి సంబంధం లేదని గత రెండు రోజులుగా స్పష్టంగా సమాధానం ఇచ్చినప్పటికీ, అదే అంశాన్ని మళ్లీ మళ్లీ తీసుకొచ్చి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.
ఆధారాలుంటే చూపండి…లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఇందాపూర్‌కు హెరిటేజ్‌కు సంబంధం ఉందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఒక్క చిన్న ఆధారం అయినా చూపించాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కానీ ఆధారాలు చూపకపోగా, బయట ప్రెస్‌మీట్లు పెట్టి చీజ్ ప్యాకెట్లు చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చీజ్,నెయ్యి మధ్య తేడా కూడా తెలియకుండా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యన్నారాయణ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఈ తప్పుడు ప్రచారంపై హెరిటేజ్ సంస్థ బొత్సకు లీగల్ నోటీసులు ఇచ్చిందని, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆధారాలుంటే చర్చిద్దాం, లేకపోతే అసత్య ప్రచారాన్ని ఆపాలని హెచ్చరించారు.
ప్రభుత్వాల పేరుతో వ్యాపారాలు కాదు….హెరిటేజ్ చారిత్రాత్మక నిర్ణయం
హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యాపార లావాదేవీలు జరపకూడదని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వాల పేరుతో డబ్బులు దోచుకునే సంస్కృతి హెరిటేజ్‌ది కాదని, గతంలో ప్రభుత్వ ధనాన్ని భారతి సిమెంట్ పేరుతో దోచుకున్న చరిత్ర వైసీపీకి మాత్రమే ఉందని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతల చర్యలు ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని, గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్‌ను ఎలా అరికట్టామో అలాగే ఇప్పుడు కూడా ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ప్రయత్నాలను సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చీని తోటలు కట్ చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం వంటి పాత పద్ధతులే ఇప్పుడు సంస్థలపై బదనాం చేయడంగా మారాయని మండిపడ్డారు.
సభను ఇబ్బందికి గురిచేయడం సరికాదు
శాసనమండలిలో ప్రతిరోజూ ఒకే అంశాన్ని తీసుకొచ్చి వాయిదా తీర్మానాలతో సభను ఇబ్బందికి గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి హెచ్చరించారు. ఆధారాలుంటే టేబుల్‌పై పెట్టండి, లేదంటే అసత్య ప్రచారం మానేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
#Atchannaidu #HeritageFoods #APPolitics #YSRCP #BotsaSatyanarayana #APAssembly #TDP #FactCheck #PoliticalWar

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
