- రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పులు భారం
- ఇసుక, మద్యం అక్రమాలను సహించం
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విధ్వంసం అయ్యిందనీ, దానిని గాడిలో పెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రూ.10 లక్షల కోట్లకు పైగా ఏపీపై అప్పు భారాన్ని కూటమి ప్రభుత్వం మోస్తుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు.
ఏపీ ఓ విషవలయంలో ఉందనే గుర్తించాలని కోరారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వచ్చేలా వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలోకి వైసీపీ నేతలు చొరబడ్డారని విమర్శించారు. ఇసుక దందాను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాపై తిరుగుబాటు చేయాలని, అందుకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. మద్యం ఎమ్మార్పీ ధరపై ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించరాదని మందుబాబులను కోరారు.
శనివారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీపై, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీతో కలిపి రూ.97లు అయ్యే సినరేజ్ ఛార్జీకి రూ.35లకే టెండర్ వేస్తామంటూ వైసీపీ నేతలు వచ్చారని అన్నారు.
ఇసుక కొరత సృష్టించి బ్లాక్‌మార్కెటింగ్ చేసి తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే అతి తక్కువ ధరకు టెండర్లు వేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా, ఉచిత ఇసుక స్ఫూర్తి దెబ్బతినకూడదనే సినరేజ్ ఛార్జీలు, జీఎస్టీ కూడా ఎత్తి వేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
నేను 1995 సిఎంనే.. 2014 సిఎంను కాదు.
2014 నన్ను చూసిన వారు అలాగే చూడడానికి లేదని తాను 1995 సీఎంనేనని, కానీ 2014 సీఎంను కాదని ఆయన అన్నారు. ఈసారి ఖచ్చితంగా రాజకీయ పరిపాలనే చేస్తానని అలాగే అధికారులను కూడా సమన్వయం చేసుకుంటానని తెలిపారు. విశ్వాసనీయతను నిలబెట్టుకుంటూ రాజకీయ ముసుగులో తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదు.
ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ వ్యవహారాలు పట్టించుకోవట్లేదని కేడర్ నుంచి వస్తున్న విమర్శలు అర్థం చేసుకోగలనని తెలిపారు. జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ రూ.10లక్షల కోట్లకు పైగా అప్పు భారం మోస్తున్నామనే విషయం జనం గ్రహించాలని కోరారు. మనం ఓ విషవలయంలో ఉన్నామని గుర్తించాలని, దీనిని పరిష్కరించేందుకు కొంత సమయం అవసరమవుతుందని చెప్పారు. ఇప్పటికే చాలా వ్యవస్థలను గాడిలో పెట్టామని అలాగే మిగిలిన వాటిని కూడా చక్కదిద్దుతామని అన్నారు.
వైసీపీ వలన నష్టపోయిన కార్యకర్తలను ఆదుకుంటాం
మొన్నటి ఎన్నికల్లో రాక్షసుడితో యుద్ధం చేశాం. వైసీపీ నేతల వల్ల నష్టపోయిన కార్యకర్తలను ఆదుకుంటూనే, ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలి. ఏపీలో ఎక్కడ ఇసుక దందా జరుగుతున్నా తిరుగుబాటు చేయండి. నేను అండగా ఉంటా. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన తప్పుడు కేసులకు చట్ట పద్ధతిలోనే పరిష్కరిస్తా. ఎవ్వరూ తొందరపడొద్దు. ఎక్కువ అంచనాలు పెట్టేసుకుని ఎవ్వరూ నిరుత్సాహపడొద్దు. రాజకీయాల్లో ఎన్ని మార్పులు, సంస్కరణలు వచ్చినా, మూల సిద్ధాంతం ప్రజాసేవని మరవద్దు’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.