కారాగారాలు సంస్కరణా కేంద్రాలు కావాలి: హోం మంత్రి వంగలపూడి అనిత
కారాగారాలు కేవలం నిర్బంధ కేంద్రాలు మాత్రమే కాకుండా మానవ గౌరవం, పునరావసం, సామాజిక పునరేకీకరణ వంటి బాధ్యతలు కలిగిన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో కీలక స్తంభమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రద్రేశ్ కారాగారశాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ సహకారంతో నగరంలోని సాగరతీరం సాయిప్రియ రిసార్ట్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన 9వ జాతీయ కారాగార పరిపాలకుల సదస్సు గురువారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, భద్రత, క్రమశిక్షణ, సురక్షలతో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, ఆధునీకరణ, సాంకేతికత ఆధారితర పారిపాలన, మానవీయ కరక్షనల్ ఆచరణల అవసరాన్ని ఆమె తెలిపారు.
కొత్త చట్టాల ఆత్మకు అనుగుణంగా రాష్ట్రాల కారాగారాలు పరిపాలన విధానాలు, ప్రక్రియలను సరిపోల్చుకోవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సదస్సు సిఫార్సులను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రయోగాత్మకంగా కాలపరిమితితో ఫలితాలపై దృష్టి పెట్టి అమలు చేయాలని కోరారు. రాష్ట్రాల మధ్య నిరంతర సహకారం, బిపిఆర్ అండ్ డి నుంచి సంస్థాగత మద్దతు అవసరమని పేర్కొన్నారు. అనంతరం జైళ్లశాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అంతకు ముందు ఆమె దేశంలోని వివిధ రాష్ట్రాల కేంద్ర కారాగారాల్లో ఖైదీలు తయారుచేసిన వస్తుప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎపి జైళ్లశాఖ డిజిపి అంజనీ కుమార్, ఎపి జైళ్లశాఖ ఐజి డాక్టర్ ఇండ్ల శ్రీనివాసరావు, వివిధ రాష్ట్రాల జైళ్లశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#VangalapudiAnitha #APPolice #PrisonReforms #VizagNews #SocialJustice #Rehabilitation #AndhraPradeshNews
