క్వాంటం కంప్యూటింగ్, ఐటీ హబ్‌గా అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను అమరావతిలో స్థాపించడం ద్వారా రాజధాని కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టిందని తెలిపారు. ఐటీ, క్వాంటం రంగాల్లో ఏపీని ఒక గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని, దీనివల్ల భవిష్యత్తులో వేలాది మంది యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
సూపర్ సిక్స్ పథకాలతో ప్రజా సంక్షేమం
ప్రజా సంక్షేమమే పరమావధిగా ఏటా రూ. 33 వేల కోట్లతో ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గవర్నర్ వివరించారు. 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం కింద 66 లక్షల మంది విద్యార్థులకు సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా పేదరికాన్ని పారద్రోలేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20 వేల పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నామని ఆయన సభకు వివరించారు.
2027 నాటికి పోలవరం.. అమరావతికి చట్టబద్ధత
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని గవర్నర్ ధృఢ నిశ్చయం వ్యక్తం చేశారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ఉంచేందుకు అవసరమైన చట్టబద్ధత ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి సహకారం అందిస్తోందని, రాజధాని రైతుల్లో మళ్లీ విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులతో పాటు హైస్పీడ్ రైల్ కారిడార్ల ద్వారా రవాణా రంగం అభివృద్ధి చెందబోతోందని చెప్పారు.
లక్షల కోట్ల పెట్టుబడులు.. క్లీన్ ఎనర్జీ లక్ష్యం
పరిశ్రమల స్థాపనలో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని, సీఐఐ సదస్సు ద్వారా రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని గవర్నర్ తెలిపారు. దీని ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక ఇంధన వనరులతో ‘క్లీన్ ఎనర్జీ హబ్’గా మారుతోందన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో ఆకాంక్షించారు.
#AndhraPradesh #APBudget2026 #Amaravati #GovernorAbdulNazeer #ITandQuantum #SuperSix #Polavaram #Swarnandhra2047 #APPolitics

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
