March 19, 2026

విద్యుత్ శాఖలో కొలువుల జాతర

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను తీర్చి, వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గురువారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఏఈలు, లైన్ మెన్ల భర్తీకి సన్నాహాలు

విద్యుత్ శాఖలో కీలకమైన అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అలాగే లైన్ మెన్ల నియామకంపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని సభకు వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 18 వేల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది సేవలను వినియోగించుకుంటూనే, శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించడం ద్వారా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,580 మంది సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖపట్నంలోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ద్వారా వీరికి శిక్షణ ఇచ్చి, వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. ఈ అసిస్టెంట్లు విధుల్లోకి వస్తే శాఖలోని 77 శాతానికి పైగా ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందని, తద్వారా విద్యుత్ అంతరాయాలను త్వరితగతిన సరిదిద్దవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రూ. 8 వేల కోట్లతో విద్యుత్ సంస్కరణలు

నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రూ. 8 వేల కోట్ల వ్యయంతో ఆర్డీఎస్ఎస్ (RDSS) పనులను చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్ ఫీడర్లను వేరు చేస్తున్నామని, వచ్చే ఏప్రిల్ నాటికి ఈ పనులు 100 శాతం పూర్తవుతాయని చెప్పారు. అలాగే, విశాఖపట్నం వంటి తీర ప్రాంతాల్లో తుపానులను తట్టుకునేలా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు.

#APElectricity #Jobs2026 #GottipatiRaviKumar #APNews #EnergySector #Employment #AndhraPradesh #PowerSupply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *