తిరుమల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ కర్తవ్యం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైవున్న తిరుమల తిరుపతి దేస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం అని, శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని తీవ్రంగా పరిగణిస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించి సత్వరమే తుది నివేదికను ప్రభుత్వానికిని సమర్పించేందుకు స్వల్పకాలిక పరిపాలనా కమిటీని ప్రభుత్వం నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రులు కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తో కలిసి మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. క్యాబినెట్ సమావేశంలో అజండా అంశాలను ప్రక్కన బెట్టి మరీ తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జరిగిన కల్తీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించడం జరిగిందన్నారు.
నెయ్యి సరఫరాలో నిభందనలకు తూట్లు
ప్రభుత్వానికి అందిన నివేదిక ప్రకారం, నెయ్యి సరఫరా, టెండర్ నిబంధనల సడలింపు, నాణ్యత లోపాలు, తప్పుడు పత్రాల సమర్పణ వంటి తీవ్రమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందన్నారు. టెండర్ నిబంధనల్లో రూ.250 కోట్ల టర్నోవర్ షరతును రూ.150 కోట్లకు తగ్గించడం, కనీస పాల ప్రొక్యూర్మెంట్ అనుభవం లేకున్నా అర్హత కల్పించడం వంటి చర్యలు ఉద్దేశపూర్వకంగా చేపట్టబడ్డాయని నివేదిక స్పష్టం చేసిందన్నారు. సుమారు రూ.58 లక్షల లీటర్ల వరకు కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు ఈ నివేదికలో వెల్లడించడం జరిగిందన్నారు.
నెయ్యి కల్తీపై సుదీర్ఘ చర్చ : మంత్రి పార్థసారధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని క్యాబినెట్ ఏకగ్రీవంగా అంగీకరించిందని మంత్రి తెలిపారు.
ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు : మంత్రి నాదెండ్ల
రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. క్యాబినెట్ సమావేశానికి అడ్వకేట్ జనరల్ ని ఆహ్వానించి చట్టపరమైన సలహాలు పొందడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశాలను బయటపెట్టి, ప్రస్తుతం ప్రభుత్వం నెయ్యి నాణ్యతపై పలు మార్లు ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తూ పారదర్శకతతో చర్యలు తీసుకుంటోందని వివరించారు. భవిష్యత్తులో ఎవరు తప్పు చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని, శ్రీవారి పవిత్రతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని క్యాబినెట్ ఏకాభిప్రాయంగా నిర్ణయించిందని ఆయన తెలిపారు.
సృష్టికి విరుద్దంగా నెయ్యి తయారు : సత్యకుమార్
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వ పాలకులు వ్యవహరించారని, రూ.250 కోట్ల అవినీతి కుంభకోణంతో పాటు పవిత్రతను నాశనం చేసినట్లు పేర్కొన్నారు. సృష్టికి విరుద్దంగా అసలు పాలే లేకుండా రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన నెయ్యిని ఉపయోగించడం ద్వారా భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం జరిగిందన్నారు. ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా దోషులను ఉపేక్షించకూడదని క్యాబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయంతీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.
#Tirumala #LadduScam #APPolitics #ChandrababuNaidu #TTD #JusticeForDevotees #BreakingNews #AndhraPradesh
#Tirumala #LadduScam #APPolitics #ChandrababuNaidu #TTD #JusticeForDevotees #BreakingNews #AndhraPradesh

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
