March 10, 2026

ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల విస్తరణ వేగం పెంపు: సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, జూన్ 9: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ మరియు రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ (Land Acquisition), అటవీ (Forest), వన్యప్రాణి (Wildlife) అనుమతులు వంటి సమస్యలు జూలై నెలాఖరులోగా పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జరిగిన రోడ్ల అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అడ్డంకులు లేకుండా అన్ని రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల్లో ఆలస్యం చోటుచేసుకోవడంపై కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు, ఇకపై ఏ ప్రాజెక్టూ ఆలస్యం కాకుండా పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం నాటికి 770 కి.మీ రహదారులు రూ.11,325 కోట్లతో పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. రాబోయే కాలంలో 1,040 కి.మీ రహదారులు రూ.20,067 కోట్లతో పూర్తయ్యేలా లక్ష్యం నిర్దేశించారని సీఎం పేర్కొన్నారు.

రూ.76,856 కోట్లతో 144 రహదారి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇందులో ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) పరిధిలో 1,392 కి.మీ, ఎంఓఆర్టీహెచ్ (MoRTH) పరిధిలో 2,091 కి.మీ రహదారులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,744 కి.మీ రహదారులలో 4,406 కి.మీ NHAI, 641 కి.మీ PIU-MoRTH, 3,697 కి.మీ NH (R&B) పరిధిలో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ను గుంతలేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం:

గత నవంబరులో ప్రారంభించిన కార్యక్రమం ద్వారా రూ.860.81 కోట్ల వ్యయంతో 19,475 కి.మీ రహదారుల గుంతలు పూడ్చి మరమ్మతులు చేసినట్లు అధికారులు తెలిపారు. 97 శాతం పనులు జూన్ 6 నాటికి పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన 3 శాతం పనులు జూలై 31 నాటికి పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *