రష్యా ఖజానా ఖాళీ అవుతోందా? 25 ఏళ్ల తర్వాత Gold నిల్వల విక్రయం!
“డ్రోన్లు లక్ష్యాలను ఛేదిస్తున్నాయి… క్షిపణులు యుద్ధ దిశను మార్చుతున్నాయి… కానీ బంగారం అమ్మకాలు మాత్రం యుద్ధం ఎంత భారంగా మారిందో చెబుతున్నాయి.”
– దీనికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
ఉక్రెయిన్‌పై నాలుగు సంవత్సరాలుగా యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా ఇప్పుడు బంగారు విక్రయాలకు దిగడం సాధారణ ఆర్థిక పరిణామం కాదు. 25 ఏళ్ల తర్వాత రష్యా కేంద్ర బ్యాంక్ తన బంగారు నిల్వలను విక్రయించడం యుద్ధ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడికి సంకేతం. యుద్ధం సాగుతున్న కొద్దీ సైనిక వ్యయం పెరుగుతుండగా ఆదాయ వనరులు పరిమితమవుతున్నాయి. దీంతో బంగారు నిల్వలను నగదుగా మార్చుకోవాల్సిన పరిస్థితి రావడం ఆర్థిక ఒత్తిడిని బహిర్గతం చేస్తోంది. అసలు దేశాలు బంగారాన్ని ఎందుకు నిల్వ చేస్తాయి? ఎందుకు విక్రయిస్తాయి? ఈ ధోరణి ఎక్కడ ప్రారంభమైంది? దీనికి అంతం ఉందా?
“డబ్బు విలువ ప్రభుత్వంపై ఆధారపడుతుంది… బంగారం విలువ ప్రపంచ నమ్మకంపై నిలబడుతుంది.” ఇదే యుగయుగాలుగా కొనసాగుతున్న ఆర్థిక సత్యం. ప్రతి దేశ కరెన్సీ ఆ దేశ ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వంపై ఆధారపడుతుంది. ప్రభావవంతమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశ కరెన్సీకి విలువ ఎక్కువ. బలహీన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశ కరెన్సీకి విలువ తక్కువ. కానీ బంగారానికి మాత్రం సరిహద్దులు లేవు. ఏ దేశంలో అయినా దాని ఒకే విలువ. అందుకే సంక్షోభ సమయంలో కరెన్సీలపై నమ్మకం తగ్గినా, బంగారంపై నమ్మకం తగ్గదు.
కరెన్సీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి… కానీ బంగారం విలువ మాత్రం నిలబడుతుందనే నమ్మకం. దేశాలు బంగారాన్ని నిల్వ చేయడానికి పలు కారణాలున్నాయి — బంగారం ఉంటే భద్రత, బంగారం అంటే నమ్మకం, బంగారమే అత్యవసర నగదు. అది ఎవరి హామీపై ఆధారపడాల్సిన పనిలేని ఆస్తి. ఆంక్షలు ఉన్నా, సంక్షోభం ఏర్పడినా వెంటనే నగదుగా మార్చుకోగల సాధనం. దేశానికి బ్రహ్మాస్త్రం. అందుకే బంగారం దేశాల ఆర్థిక రక్షణ గోడగా మారింది. అందుకే..
“కరెన్సీలు మారుతాయి… బంగారం మాత్రం ప్రపంచం అంగీకరించిన శాశ్వత కరెన్సీ.”
అందుకే బంగారాన్ని భారీగా నిల్వ చేసి ఆర్థిక బలం పెంచుకోవడానికి దేశాలు పోటీ పడుతున్నాయి. అమెరికా సుమారు 8,100 టన్నులు, జర్మనీ 3,300 టన్నులు, ఇటలీ 2,450 టన్నులు, ఫ్రాన్స్ 2,430 టన్నులు, రష్యా దాదాపు 2,300 టన్నుల బంగారాన్ని నిల్వగా ఉంచుకున్నాయి. ఈ నిల్వలు కేవలం సంఖ్యలు కాదు — ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాల స్థానం, ప్రభావాన్ని ప్రతిబింబించే సూచికలు. ఇండియా కూడా 820–830 టన్నుల బంగారాన్ని నిల్వ చేసి 9 స్థానంలో ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే, దేశాలు బంగారం ఎందుకు అమ్ముతాయి? యుద్ధ ఖర్చులు తీర్చడానికి మాత్రమేనా? కాదు. పలు పరిస్థితుల్లో బంగారం విక్రయాలు జరుగుతాయి. బడ్జెట్ లోటు పెరిగినప్పుడు, ఆర్థిక సంక్షోభం ముదిరినప్పుడు, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు దేశాలు బంగారాన్ని నగదుగా మార్చుకుంటాయి. విదేశీ ఆంక్షలు విధించినప్పుడు, వాణిజ్య పరిమితులు ఎదురైనప్పుడు, విదేశీ కరెన్సీ కొరత ఏర్పడినప్పుడు కూడా అదే మార్గం ఎంచుకుంటాయి. కరెన్సీ విలువ కాపాడేందుకు అత్యవసర నగదు అవసరమైనప్పుడు చివరికి ‘శాశ్వత కరెన్సీ’నే వినియోగిస్తాయి.
Read this article also: ఎన్నికల వరకు తగ్గింపులు… తర్వాత పెంపులు — ఇదే మళ్లీ పునరావృతమవుతుందా?
“బంగారం నిల్వలు సంక్షోభాన్ని తట్టుకునే శక్తి… బంగారం అమ్మకం సంక్షోభం తీవ్రతను చూపే సంకేతం.”
– ఇది చరిత్ర చెప్పిన సత్యం. అందుకు ఎన్నో తార్కాణాలున్నాయి.
ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన వెనిజులా తన బంగారు నిల్వలను భారీగా వినియోగించింది. 2015లో 350 టన్నులకుపైగా ఉన్న నిల్వలు 2020 నాటికి 100 టన్నుల కంటే దిగువకు పడిపోయాయి. అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు 200 టన్నుల బంగారం నగదుగా మార్చుకుంది. ప్రభుత్వ ఖర్చులు, అప్పు చెల్లింపులు, విదేశీ కరెన్సీ కొరతను తీర్చడానికి ఈ విక్రయాలు జరిగాయి.
సోవియట్ యూనియన్ – 1930ల కాలంలో పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం, సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడం లక్ష్యంగా 1930లలో సోవియట్ యూనియన్ భారీగా విదేశాల నుంచి యంత్రాలు, సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసింది. ఇందుకు అవసరమైన విదేశీ కరెన్సీ కొరత ఏర్పడడంతో బంగారు నిల్వలను విక్రయించి నిధులు సమీకరించింది. ముఖ్యంగా 1928 నుంచి ప్రారంభమైన ఐదేళ్ల ప్రణాళికల కాలంలో ఈ విక్రయాలు పెరిగాయి. పాశ్చాత్య దేశాల నుంచి పరిశ్రమల యంత్రాలు, తయారీ సాంకేతికతను దిగుమతి చేసుకోవడానికి సోవియట్ యూనియన్ బంగారాన్ని నగదుగా మార్చుకుంది. దేశాన్ని వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక శక్తిగా మార్చే ప్రయత్నంలో బంగారు నిల్వలను వినియోగించిన ఉదంతంగా ఇది చరిత్రలో నిలిచింది.
యుద్ధం కాదు… కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. విదేశీ మారక నిల్వలు రెండు వారాల దిగుమతులకు కూడా సరిపోని స్థాయికి పడిపోయాయి. అత్యవసర నగదు కోసం భారత్ తన బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 1991లో భారత్ మొత్తం 67 టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకులకు తాకట్టు పెట్టింది. అందులో సుమారు 47 టన్నులు Bank of England వద్ద, మరో 20 టన్నులు Union Bank of Switzerland వద్ద ఉంచి విదేశీ మారక ద్రవ్యాన్ని సమీకరించింది. ఈ చర్యతో అత్యవసర రుణం తీసుకుని దేశం తక్షణ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇది దేశ చరిత్రలో పెద్ద ఆర్థిక అత్యవసర చర్య.
ఇక యుద్ద సందర్భాల విషయానికొస్తే, జర్మనీ 1914–1918 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ప్రభుత్వం “Gold for Iron” ప్రచారం చేపట్టింది. ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని సేకరించి, ప్రతిగా ఇనుప ఉంగరాలు ఇచ్చింది. యుద్ధ ఖర్చుల కోసం దేశం తన ఖజానాలోని బంగారాన్ని మాత్రమే కాదు, ప్రజల బంగారాన్నికూడా వినియోగించింది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ దాడి భయం పెరగడంతో బ్రిటన్ తన బంగారం నిల్వలను రక్షించుకోవడంతో పాటు యుద్ధ ఖర్చులకు నిధులు సమీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1939–1940 మధ్య బ్రిటన్ ప్రభుత్వం రహస్యంగా సముద్ర మార్గాన భారీ మొత్తంలో బంగారం, ఆర్థిక సెక్యూరిటీలను ఉత్తర అమెరికాకు తరలించింది. ఈ రహస్య చర్యను “Operation Fish”గా పిలిచారు. జర్మనీ చేతుల్లో పడకుండా నిల్వలను భద్రపరచడం, అదే సమయంలో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఈ బంగారాన్ని వినియోగించడం లక్ష్యంగా ఈ చర్య చేపట్టబడింది.
“దేశం బంగారం అమ్మే దశకు వస్తే… యుద్ధం మైదానం దాటి ఖజానాలోకి చేరినట్టే.”
ప్రస్తుతం రష్యా పరిస్థితి ఇదే. వారం రోజుల్లో ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ యుద్ధం ఐదో ఏడాదిలోకి వెళ్లింది. ఈ యుద్ధం రష్యాను సైనికంగా, ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. పాశ్చాత్య అంచనాల ప్రకారం రష్యా సైనిక నష్టాలు 3 లక్షల వరకు చేరాయి. అదే సమయంలో 2025–26లో రష్యా రక్షణ వ్యయం 16 ట్రిలియన్ రూబిళ్లు దాటింది — ఇది దేశ GDPలో దాదాపు 7–8 శాతం. బడ్జెట్ లోటు 3.8 ట్రిలియన్ రూబిళ్లుగా పెరిగింది.
అమెరికా–పాశ్చాత్య ఆంక్షలతో ఆదాయ వనరులు కుదించబడ్డాయి. బ్యాంకింగ్ పరిమితులు, టెక్నాలజీ నిషేధాలు, చమురు ధర పరిమితి — ఇవన్నీ కలిసి రష్యా ఆయిల్ ఆదాయాన్ని తగ్గించాయి. యుద్ధానికి ముందు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇంధన రంగమే ఒత్తిడికి గురైంది. నేషనల్ వెల్త్ ఫండ్‌లో లిక్విడ్ ఆస్తులు 113 బిలియన్ డాలర్ల నుంచి 52 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
ఇదే సమయంలో క్షిపణులు, డ్రోన్లు, ట్యాంకులు, గోళాల తయారీకి భారీ వ్యయం పెరుగుతోంది. యుద్ధం పొడిగిన కొద్దీ ఖర్చు పెరుగుతోంది, కానీ ఆదాయం తగ్గుతోంది. ఈ ఒత్తిడిలో రష్యా బంగారు నిల్వలను నగదుగా మార్చే దశకు వచ్చింది. 2026 ప్రారంభంలోనే సుమారు 15 టన్నుల బంగారం విక్రయించడం యాదృచ్ఛికం కాదు. రష్యా ఇంకెంత విక్రయించాల్సి వస్తుందో తెలియదు. ఇవి యుద్ధ వెనుక దాగి ఉన్న చేదు నిజాలు.
“క్షిపణులు యుద్ధాన్ని నడుపుతున్నాయి… కానీ ఆ యుద్ధం ఎంత భారంగా మారిందో బంగారం చెబుతోంది.”
English Summary
The ongoing conflict between Russia and Ukraine has significantly strained Russia’s economy, forcing the central bank to sell its gold reserves for the first time in 25 years. Increasing military expenditures and dwindling revenue sources due to global sanctions have pushed the nation toward this drastic financial measure. Historically, gold has always been the ultimate safety net during wartime, as seen with India in 1991 and Britain during World War II.
Russia’s defense spending has now reached a staggering 16 trillion rubles, making up nearly 8% of its GDP. With liquid assets in the National Wealth Fund rapidly declining, the sale of gold highlights the immense pressure on the Kremlin. This trend indicates that while missiles and drones dictate the battlefield, gold sales reveal the true economic burden of a prolonged war.
Dr. PY Reddy,
pyreddydr@gmail.com
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
