March 27, 2026

కడపలో సీపీఎస్ ఉద్యోగుల ‘మహా గర్జన’

CPS EMPLOYEES ASSOCIATION

CPS EMPLOYEES ASSOCIATION

పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మే 1వ తేదీన కడపలో ‘మహా సంకల్ప గర్జన’ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

గత 21 ఏళ్లుగా పెన్షన్ లేక లక్షలాది మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కిరణ్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న జీపీఎస్ (GPS), యూపీఎస్ (UPS) విధానాలు ఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనకరం కాదని, అవి కేవలం మభ్యపెట్టే ప్రయత్నాలేనని అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల పాటు సేవ చేసిన ఉద్యోగికి కనీసం వృద్ధాప్య పింఛనులో సగం కూడా అందకపోవడం బాధాకరమన్నారు. పెన్షన్ కోసం ఉద్యోగి చనిపోవాలా అని వారు నిలదీశారు.

ఉద్యోగులకు రావాల్సిన ఐఆర్ (IR), పీఆర్సీ (PRC), డీఏ (DA) బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కడపలో భారీ ఎత్తున ‘మహా సంకల్ప గర్జన’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయంపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని వారు స్పష్టం చేశారు.

CPS #OPS #AndhraPradesh #EmployeesProtest #Kadapa #PensionRights #APNews #MahaGarjana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *