September 28, 2026

వేసవి తాపానికి ‘బార్లీ జావ’తో చెక్..

ఎండలు ముదిరిపోతున్నాయి. మే నెల రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయటకు వెళ్తే చాలు ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోయి నీరసం ఆవహిస్తోంది. డీహైడ్రేషన్, వడదెబ్బ, అజీర్తి వంటి సమస్యలు ఈ కాలంలో సర్వసాధారణం. అయితే, వీటన్నింటికీ విరుగుడుగా మన వంటింట్లోనే ఉండే బార్లీతో అద్భుతమైన జావను తయారు చేసుకోవచ్చు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా చలవను కూడా కలిగిస్తుంది.

బార్లీలో కాల్షియం, ఫైబర్, ఇనుము, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా డయాబెటిస్ నియంత్రణకు, బరువు తగ్గడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కలిగే అజీర్తి సమస్యలను ఇది దూరం చేస్తుంది. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బార్లీ జావను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా కుక్కర్‌లో గ్లాసున్నర బార్లీ తీసుకుని శుభ్రంగా కడిగి, మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పూర్తిగా చల్లార్చుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని కొంచెం నీళ్లు పోసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో గ్లాసు పెరుగు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. రుచి కోసం కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము కూడా జోడించాలి.

చివరగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువతో తాలింపు వేయాలి. అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి ఒక నిమిషం వేయించి, ఆ తాలింపును బార్లీ మిశ్రమంలో కలుపుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ జావ సిద్ధం. ఈ వేసవిలో రోజుకో గ్లాసు ఈ జావ తాగితే ఆరోగ్యంతో పాటు హాయిని కూడా పొందవచ్చు.

#SummerHealth #BarleyJava #HealthyDrinks #SummerTips #Dehydration #NaturalRemedy #HealthyLifestyle #BarleyBenefits #TeluguArogyam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *