‘హగ్’లు లేవు.. ఫోటో షూట్లు లేవు.! ఏమయ్యింది ‘విశ్వగురూ…’?
- ట్రంప్, నెతన్యాహులను చూసి భయమా?
- బ్రిక్స్ అధ్యక్ష పదవికి దక్కిన గౌరవం ఇదేనా?
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో, భారత విదేశాంగ విధానంపై కాంగ్రెస్ పార్టీ సంధించిన విమర్శలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ‘విశ్వగురువు’ అనే ప్రతిష్టను పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి ఎందుకు ఉపయోగించడం లేదని జైరాం రమేష్ ప్రశ్నించారు.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నా, భారత్ అధ్యక్షతన జరగాల్సిన బ్రిక్స్ (BRICS+) సమ్మిట్‌ను ముందుకు జరపడంలో ప్రధాని మోదీ జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది కేవలం దౌత్యపరమైన వైఫల్యం మాత్రమే కాదు, అమెరికా ఒత్తిడికి తలొగ్గడమేనని విమర్శించింది.
ప్రధాని మోదీ విదేశీ నేతలతో ఫోన్లలో మాట్లాడుతున్నారని, కానీ దానివల్ల ప్రయోజనం లేదని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. “ఫోన్ కాల్స్‌లో కౌగిలింతలు ఉండవు, వేలు చూపిస్తూ జ్ఞానబోధ చేసే ఫోటోలకు అవకాశం ఉండదు. అందుకే ప్రధాని సమ్మిట్ నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదు” అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ముఖాముఖి చర్చలు జరిగితేనే శాంతి దిశగా అడుగులు పడతాయని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
Read this article also : భారీగా తగ్గనున్న బంగారం ధరలు? కారణాలివే!
ట్రంప్, నెతన్యాహులను చూసి భయమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులతో ఉన్న వ్యక్తిగత స్నేహం కారణంగానే మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం భారత నైతిక విలువలకే విరుద్ధమని, కేవలం వారిని ‘ప్రసన్నం’ (Appease) చేసుకోవడానికే భారత్ తన గొంతుకను వినిపించడం లేదని మండిపడింది.
బ్రిక్స్ అధ్యక్ష పదవికి దక్కిన గౌరవం ఇదేనా?
బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్నా, పశ్చిమాసియా సంక్షోభంపై కనీసం ఒక ఉమ్మడి ప్రకటన (Collective Statement) కూడా విడుదల చేయలేకపోవడం మోడీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టను ప్రధాని దిగజార్చుతున్నారని పార్టీ ఆరోపించింది.

