రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ ‘రాజీనామా’ సవాల్.. ఆ రూ. 57,000 కోట్లు ఎక్కడివి?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా మహిళా సంఘాలకు అందజేసిన రుణాల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు పచ్చి అబద్ధాలని, వాటిని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సంచలన సవాల్ విసిరారు.
అబద్ధాల పునాదులపై పాలన: కేటీఆర్
మహిళా స్వయం సహాయక సంఘాలకు గడిచిన కొద్ది నెలల్లోనే రూ. 57,000 కోట్ల రుణాలు ఇచ్చామని ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. “ప్రభుత్వం చెబుతున్న ఈ నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం ప్రచారం కోసం పచ్చి అబద్ధాలను ప్రజల మీదకు వదులుతున్నారు” అని ఆయన మండిపడ్డారు. నిజంగానే అంత మొత్తం రుణాలు ఇచ్చి ఉంటే, దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు.
రాజీనామా సవాల్‌తో సెగలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ పదునైన విమర్శలు చేశారు. “ముఖ్యమంత్రి గారూ.. మీరు చెబుతున్న రూ. 57,000 కోట్ల రుణాల పంపిణీ నిజమని నిరూపించగలరా? ఒకవేళ మీరు ఆ వివరాలను గణంకాలతో సహా నిరూపిస్తే, నేను నా ఎమ్మెల్యే పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తాను. లేదంటే ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు మీరు క్షమాపణ చెబుతారా?” అంటూ సవాల్ విసిరారు.
మహిళలను వంచిస్తున్నారంటూ ధ్వజం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీల అమలులో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి ఇంతవరకు అతీగతీ లేదని, ఇప్పుడు రుణాల పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా, గ్రౌండ్ లెవల్‌లో మహిళలకు అందుతున్న లబ్ధి ఎంతో చెప్పాలని ఆయన కోరారు.

