March 13, 2026

జల జీవన్ మిషన్‌కు రూ. 9,355 కోట్లు..

CM CHANDRABABU REVIEW

CM CHANDRABABU REVIEW

గిరిజన రైతులకు 100% సబ్సిడీ!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర జీవనాడి పోలవరం పనుల వేగవంతం నుంచి, తాగునీరు, విద్య, ఉపాధి వరకు ప్రభుత్వం పలు ప్రజాకర్షక నిర్ణయాలను వెల్లడించింది. ముఖ్యంగా జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు భారీగా నిధులను కేటాయించడంతో పాటు, రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి కేబినెట్ వివరాలను మీడియాకు వెల్లడించారు.


జల జీవన్ మిషన్‌తో 65 లక్షల మందికి లబ్ధి

ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జల జీవన్ మిషన్ కింద రూ. 9,355 కోట్ల విలువైన ఏడు భారీ ప్రాజెక్టులకు కేబినెట్ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ పథకం గడువును 2028 వరకు పొడిగించడమే కాకుండా, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రూ. 1,814 కోట్లతో పనులు చేపట్టనున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 76 మండలాల్లో సుమారు 65 లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి.

కడప స్టీల్ ప్లాంట్‌కు లైన్ క్లియర్

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధిలో కీలకమైన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జమ్మలమడుగు ప్రాంతంలో 424.45 ఎకరాల భూమిని జేఎస్‌డబ్ల్యూ (JSW) స్టీల్ సంస్థకు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలమందికి ఉపాధి లభించనుంది. దీనితో పాటు పోలవరం పనుల వేగవంతానికి అదనపు నిధులు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మహిళా ఉద్యోగినులకు ‘సఖీ నివాస్’

ఉద్యోగాలు చేసే మహిళల భద్రత మరియు వసతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 ‘సఖీ నివాస్’ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హాస్టళ్లలో చిన్న పిల్లలున్న తల్లుల కోసం ప్రత్యేకంగా క్రెష్ (శిశు సంరక్షణ కేంద్రం) సౌకర్యం కూడా కల్పించనున్నారు. అలాగే గిరిజన రైతులను ఆదుకునేలా డ్రిప్ ఇరిగేషన్‌పై 100 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విద్యా రంగంలో కీలక ముందడుగు

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా మూడు కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు భూ కేటాయింపులు జరిగాయి. నందిగామ, నూజివీడు, పలాస ప్రాంతాల్లో ఈ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. అటు వ్యాపారుల సౌలభ్యం కోసం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలో మూడు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు రాజధాని అమరావతిలో ఆసుపత్రులు, విద్యా సంస్థల కోసం భూ కేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

APCabinet #AndhraPradesh #JalJeevanMission #KadapaSteelPlant #Polavaram #WomenEmpowerment #APNews #ChandrababuNaidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *