తిరుపతి రూపురేఖలు మార్చాం.. మేయర్ భావోద్వేగం
TIRUPATHI MAYOR SIRISHA
ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌గా ఐదేళ్ల పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న డాక్టర్ శిరీష, కౌన్సిల్ చివరి సమావేశంలో భావోద్వేగ ప్రసంగం చేశారు. సామాన్య డాక్టర్‌గా ఉన్న తనకు నగరాభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిని గ్రేటర్ నగరంగా మార్చే ప్రక్రియలో తమ పాలనలో తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని ఆమె కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు, అధికారులు అందించిన సహకారం మరువలేనిదని మేయర్ పేర్కొన్నారు.
అరుదైన గౌరవం.. అద్భుత ప్రయాణం
తిరుపతి నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం తన అదృష్టమని డాక్టర్ శిరీష అన్నారు. ఐదు లక్షల మంది జనాభా ఉన్న నగరానికి ప్రథమ పౌరురాలిగా సేవ చేసే అవకాశం రావడం సామాన్య విషయం కాదని, ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయని నెమరువేసుకున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా, ఒక సామాన్య మహిళకు ఇంతటి ఉన్నత స్థానాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నగర రూపురేఖల మార్పే లక్ష్యం
గతంలో పాలక వర్గాలు కేవలం అంతర్గత అభివృద్ధికి పరిమితమైతే, తమ హయాంలో నగరం నలుమూలలా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం చేపట్టామని మేయర్ వివరించారు. కోర్లగుంట, గంగమ్మ గుడి, బాలాజీ కాలనీ, ఎంఆర్ పల్లి వంటి కీలక కూడళ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ కష్టాలను తొలగించామని గర్వంగా చెప్పారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ రోడ్లే తిరుపతి అభివృద్ధికి సాక్ష్యాలని ఆమె పేర్కొన్నారు.
భక్తురాలిగా గంగమ్మ ఆలయ అభివృద్ధిపై సంతృప్తి
తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ఒక సాధారణ భక్తురాలిగా వెళ్లిన రోజుల్లో పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ, నేడు ఆ ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆడిటోరియం నిర్మాణం, కబడ్డీ పోటీల నిర్వహణ వంటి అంశాలు భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించాయని వివరించారు.
అధికారులు, కుటుంబ సభ్యుల వెన్నుదన్ను
కరోనా వంటి క్లిష్ట సమయంలో కార్పొరేటర్లు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు దేశానికే ఆదర్శమని మేయర్ కొనియాడారు. గిరీష నుంచి ప్రస్తుత కమిషనర్ మౌర్య వరకు అందరు ఐఏఎస్ అధికారుల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో తనను నిరంతరం ప్రోత్సహించిన భర్త డాక్టర్ మునిశేఖర్ మరియు కుటుంబ సభ్యుల సహకారం వల్లే బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలిగానని స్పష్టం చేశారు. ఎక్కడా వివాదాలకు తావులేకుండా, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవీ కాలాన్ని పూర్తి చేయడం గర్వంగా ఉందని ఆమె ముగించారు.

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
