March 11, 2026

బాబుగారి ఆర్థిక విధ్వంసం @ Rs.3.2 లక్షల కోట్లు : జగన్ నిప్పులు!

Jagan comments on Babu

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, అప్పుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

బుధవారం (మార్చి 11, 2026) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. కేవలం రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ. 3.2 లక్షల కోట్ల అప్పులు చేసిందని సంచలన గణాంకాలు విడుదల చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులకు సమానమైన మొత్తాన్ని ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే తెచ్చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.

అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు చిన్నాభిన్నం చేశారని, పరిమితికి మించి అప్పులు తేవడంపై జగన్ నిరసన వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే నిబంధనలకు విరుద్ధంగా రూ. 17,953 కోట్ల అప్పును అదనంగా తీసుకువచ్చారని జగన్ ఆరోపించారు. 36 శాత లోటు ఏర్పడిందన్నారు. 2025-26లో పరిస్థితి ఇంకా దారుణంగా మారబోతోందని హెచ్చరించారు. 39 శాతం లోటుతో రాష్ట్రాన్ని మరింత దిగజార్చారని మండి పడ్డారు.

కరోనాలాంటి విపత్కర పరిస్థితిలలో తమ ఐదేళ్ల పాలనలో కేవలం రూ. 3.31 లక్షల కోట్లు అప్పులు చేయాల్సి వస్తే, చంద్రబాబు కేవలం రెండేళ్లలోనే రూ.3.2 లక్షల కోట్లు అప్పు చేసి తన ఘనతను చాటుకున్నారని ఎద్దేవా చేశారు. తమ హయాంలో చేసిన అప్పుల్లో 96 శాతం అప్పులను వీరు ఈ రెండేళ్లలోనే చేసేశారనిజగన్ లెక్కలతో వివరించారు. ఎవరు ఆర్థిక వ్యవస్థను క్రమశిక్షణతో నడిపారో ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ మార్గాలు తగ్గిపోయాయని జగన్ విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ రాబడులు చంద్రబాబు హయాంలో దారుణంగా పడిపోయాయని, దానికి పాలకుల అసమర్థతే కారణమని ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థను డ్యామేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తులని విమర్శించారు. ఉదాహరణకు రూ.5వేలకోట్ల విలువైన ఆస్తులను తన బంధువులకు అప్పగిస్తే ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు.

ప్రజలపై భారం: విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నా, క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని, సంక్షేమ పథకాల అమలులో కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అప్పులు తెచ్చి కాలక్షేపం చేస్తున్నారే తప్ప, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం లేదని జగన్ మండిపడ్డారు.

#YSJagan #ChandrababuNaidu #APEconomy #APDebts #YSRCP #TDP #AndhraPradeshNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *