ప్రపంచ విజేత టీమిండియాపై కాసుల వర్షం
INDIAN T20 CRICKET TEAM
బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ జట్టులో నలుగురు భారతీయులు
టీ20 ప్రపంచకప్ 2026ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ బహుమతుల వర్షం కురిపించింది. విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి ఏకంగా రూ. 131 కోట్ల భారీ నజరానాను బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024లో సాధించిన విజయం కంటే ఈసారి మరో ఆరు కోట్ల రూపాయలు అదనంగా పెంచి, ఆటగాళ్ల కృషిని గౌరవించారు. మూడుసార్లు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన ఏకైక జట్టుగా టీమిండియా తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
విజేతలకు ఐసీసీ భారీ ప్రైజ్ మనీ
వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ ప్రకటించిన నజరానాతో పాటు ఐసీసీ నుంచి కూడా భారీగా నగదు బహుమతి లభించింది. విజేతగా నిలిచిన భారత్‌కు రూ. 21.5 కోట్లు అందజేయగా, రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ. 10.75 కోట్లు లభించాయి. అద్భుత ప్రదర్శనతో టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్న భారత జట్టుకు ఈ గెలుపు ద్వారా ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని స్థానం లభించిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’లో భారత్ హవా
ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రకటించిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’లో భారత్ నుంచి నలుగురు స్టార్ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన సంజూ శాంసన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (317 పరుగులు), ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (14 వికెట్లు) ఐసీసీ జట్టులో స్థానం సంపాదించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆడెన్ మార్‌క్రమ్ ఈ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నారు.
ప్రపంచ జట్టులో చోటు దక్కించుకున్నది వీరే
ఐసీసీ ప్రకటించిన ఈ అత్యుత్తమ జట్టులో మార్‌క్రమ్ (సారథి), సాహిబ్‌జాదా ఫర్హాన్ (పాకిస్థాన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ (ఇంగ్లండ్), హోల్డర్ (వెస్టిండీస్), బుమ్రా, ఎంగిడి (దక్షిణాఫ్రికా), అదిల్ రషీద్ (ఇంగ్లండ్), ముజార్బనీ (జింబాబ్వే) ఉన్నారు. అమెరికా పేసర్ షాడ్లే 12వ ఆటగాడిగా ఎంపికయ్యారు. విశేషమేమిటంటే రన్నరప్ న్యూజిలాండ్, మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్ల నుంచి ఎవరికీ ఈ జట్టులో చోటు దక్కలేదు.
T20WorldCup #TeamIndia #BCCI #CricketNews #Champions #SanjuSamson #Bumrah #IndianCricket #WorldCup2026

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
