
- పాకిస్తాన్‌కు మోడి హెచ్చరిక
భారతను పదే పదే ఉగ్రదాడితో విసిగిస్తున్న పాకిస్తాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా హెచ్చరించారు. మరోమారు ఉగ్రవాదంపై భారత్ వైఖరిని కుండబద్దలు కొట్టారు. “శాంతిగా బతుకుతారా లేదా బుల్లెట్ రుచి చూస్తారా” అని పాకిస్తాన్నుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
తమ దేశాన్ని ఉగ్రవాదం కోరల నుండి బయటపడేయాల్సిన బాధ్యత పాకిస్తాన్‌దే అని స్పష్టం చేశారు. “శాంతిగా బ్రెడ్ తింటారా, లేదా బుల్లెట్ తినడానికి సిద్ధంగా ఉండాలి,” అని మోడీ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత సైన్యం ధాటికి పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయని, భారత దళాల శౌర్యం వల్లే పాకిస్తాన్ తెల్ల జెండా ఊపిందని మోడీ గుర్తు చేశారు. “మీ ఉగ్రవాద స్థావరాలే మా లక్ష్యం అని మేము ముందే చెప్పాము. మీరు మౌనంగా ఉండాల్సింది. కానీ మీరు తప్పు చేశారు, ఇప్పుడు దాని పర్యవసానాలను ఎదుర్కోవాలి,” అని ఉద్ఘాటించారు.
భారత్ ఇచ్చిన ప్రబల ప్రతిస్పందనతో పాకిస్తాన్ వణికిపోయిందని మోడీ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా కచ్‌లో డ్రోన్‌లను పంపారని పేర్కొన్నారు. అయితే, 1971 యుద్ధ సమయంలో భుజ్ రన్‌వేను 72 గంటల్లో మరమ్మత్తు చేసిన కచ్ వీరవనితల సాహసాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆ మహిళలు తనను కలిసి ఆశీర్వదించారని, సింధూర మొక్కను బహుకరించారని, దానిని ప్రధాని నివాసంలో నాటనున్నట్లు మోడీ తెలిపారు.
గుజరాత్‌లోని భుజ్‌లో రోడ్‌షో నిర్వహించి, పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ, దాహోడ్‌లో జరిగిన సభలో ఉగ్రవాదంపై మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రధాని ప్రస్తావించారు. “ఎవరైనా మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచివేయడానికి సాహసిస్తే, వారి అంతం ఖాయం,” అని మోడీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, భారతీయ విలువలకూ, మన హృదయాలకు దగ్గరైన లోతైన భావోద్వేగాలకూ ఇది ప్రతిబింబమని ఆయన స్పష్టం చేశారు.