
- 10 రోజులకు తర్వాత భారత్‌కు అప్పగింపు
- సోషల్ మీడియా మాయలో ఓ సాహస ప్రయాణం
పాకిస్తాన్ ఆడే నాటకాలకు మర మహిళ బలి పశువుగా మారింది. సామాజిక మాధ్యమ మాయగాళ్ల మాయలో నాగ్‌పూర్‌కు చెందిన 43 ఏళ్ల సునీత దేశ సరిహద్దులు దాటేసింది. అక్కడ నుంచి పాకిస్తాన్‌లో ప్రవేశించింది. చివరకు పాకిస్తాన్ సైన్యం ఆమెను భారతదేశానికి అప్పగించారు. వివరాలి ఉన్నాయి.
నాగ్‌పూర్‌కు చెందిన సునీత అనే మహిళ 10 రోజుల క్రితం లడఖ్‌లోని కార్గిల్ జిల్లా హుందర్మాన్ గ్రామం వద్ద నుంచి నియంత్రణ రేఖ (LoC) దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లిన ఘటన ఉద్రిక్తతల మధ్య ఆందోళనకు గురి చేసింది.
పాకిస్తాన్‌కు చెందిన జుల్ఫికార్ అనే వ్యక్తితో పాటు, పాస్టర్‌గా గుర్తింపు పొందిన మరొకరితో సునీత గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా సంబంధం కలిగి ఉన్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఆమె వారిని కలవడానికి ప్రయత్నించిందా? లేక హుందర్మాన్ ప్రాంతంలోని కఠిన భౌగోళిక పరిస్థితుల్లో తప్పిపోయిందా? అన్నది ఇంకా స్పష్టత లేదు.
మే 4న సునీత నాగ్‌పూర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి, 8వ తరగతి చదువుతున్న తన కుమారుడిని కూడా తీసుకెళ్లారు. మే 5న అమృతసర్ కోర్టుకు హాజరవ్వాల్సి ఉందని కుటుంబసభ్యులకు చెప్పిన సునీత, అసలైన గమ్యం కార్గిల్‌కి వెళ్లడం మే 9న స్పష్టమైంది.
హోటల్‌లో చెక్‌ఇన్ అయిన తర్వాత ఆమె LoC దాటి పాకిస్తాన్ వెళ్లారు. కుమారుడిని వదిలివెళ్లడం స్థానిక అధికారుల్లో హడావిడిని రేపింది. కార్గిల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, బాలుడిని రక్షించి స్థానిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సంరక్షణలో ఉంచారు. ఆయా అధికారుల అనుమతితోనే బాలుడు తిరిగి నాగ్‌పూర్‌కు వెళ్తాడని CWC చైర్మన్ నియాజ్ అలీ తెలిపారు.
పాకిస్తాన్‌లో అడుగు పెట్టిన ఆమెను ఆ దేశ సైన్యం బంధించింది. 10 రోజుల తరువాత శనివారం ఆమెను పాక్ సైన్యం భారత దేశ అధికారులకు అప్పగించారు.
అమృతసర్‌లో సునీతను తీసుకోడానికి నాగ్‌పూర్ పోలీసులు ఇప్పటికే బయలుదేరినట్లు జోనల్ డీసీపీ నికేతన్ కదమ్ తెలిపారు. ఆమెపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, అమృతసర్ నుంచి అధికారిక సమాచారం రాకపోవడంతో కార్గిల్ ఎస్‌ఎస్‌పీ శ్రీరామ్ వేచి చూస్తున్నారు.
అమృతసర్ రూరల్ పోలీసులు సునీతపై కేసు నమోదు చేశారు. కాగా ఆమెపై గతంలో నాగ్‌పూర్‌లోని కపిల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ‘మిస్సింగ్ పర్సన్’ కేసులో మరో సెక్షన్లు చేర్చే అవకాశముంది.
ఇదివరకూ రెండు సార్లు ఏప్రిల్‌లో అటారీ వద్ద పాకిస్తాన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సునీతను బీఎస్ఎఫ్ అరెస్ట్ చేసి అమృతసర్ పోలీసులకు అప్పగించింది. ఆమె గత ప్రయత్నాలే భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశాయి.
ఇటీవలి కాలంలో ఇటువంటి ఘటనలు కొన్ని చోటుచేసుకున్నా, సునీత ప్రయాణం వెనుక మతపరమైన మాయామాటలే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.