
భవిష్యత్తు నిర్మాణానికి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కలలు కంటున్న భారతీయ యువతకు కెనడా ఒక ప్రముఖ గమ్యస్థానం. కానీ, ఇప్పుడు ఆ కలలకు అడ్డంకుల మేఘాలు కమ్ముకొంటున్నాయి. కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల ప్రవేశంపై ఆంక్షలు విధించడమే కాక, భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్లను గణనీయంగా తగ్గించింది.
తాజా గణాంకాలు చూస్తే, భారత విద్యార్థుల ఆశలను ఆ దేశం ఎంతవరకు తగ్గించిందో అర్థమవుతుంది.
అంతర్జాతీయ విద్యార్థుల కోసం, ముఖ్యంగా భారతీయుల కోసం, కెనడా స్టడీ పర్మిట్ విధానంలో ఇటీవల భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కెనడా ఇమిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ (IRCC) తాజా గణాంకాల ప్రకారం, భారతీయులకు ఇచ్చే స్టడీ పర్మిట్లలో తీవ్రమైన కోత కనిపిస్తోంది.
2025 మొదటి త్రైమాసికంలో కేవలం 30,640 స్టడీ పర్మిట్లు మాత్రమే జారీ కాగా, ఇదే కాలంలో 2024లో 44,295 పర్మిట్లు ఇచ్చారు. అంటే దాదాపు 31 శాతం తగ్గుదల.
ఇది కేవలం భారతీయులకే కాదు – మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యపై కెనడా చేపట్టిన పరిమిత విధానాల్లో భాగం. 2023 చివర్లో ప్రభుత్వం విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది.
ఆ సంవత్సరం మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లు జారీ కాగా, అందులో 2,78,045 భారతీయులవి. కానీ, 2024లో ఇది 5,16,275కి తగ్గిపోయింది. భారతీయుల వాటా 1,88,465కి పరిమితమైంది.
ఇది కెనడా ప్రభుత్వం చేపట్టిన “స్థిరీకరణ” చర్యల్లో భాగం. ఆశ్రయదారులు, విదేశీ కార్మికులు, విద్యార్థులు వలన వసతి ధరలు పెరగడం, ఆరోగ్య-రవాణా వనరులపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ప్రధాని మార్క్ కార్నీ ప్రకారం, తాత్కాలిక నివాసితుల సంఖ్య 2028 నాటికి దేశ జనాభాలో 5 శాతాన్ని మించరాదు.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 2025లో స్టడీ పర్మిట్లకు గరిష్ఠంగా 4,37,000 పరిమితి విధించారు. ఇది 2024లో నిర్ణయించిన 4,85,000 లక్ష్యంతో పోలిస్తే తగ్గింపు. ఈ పరిమితి 2026 వరకూ వర్తిస్తుంది.
స్టడీ పర్మిట్ అభ్యర్థులకు కొత్త నిబంధనలు:
నిధుల నిరూపణ పెంపు: 2024 జనవరి 1 నుంచి కొత్తగా దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం CA$ 20,635 (సుమారుగా రూ. 12.7 లక్షలు) నిధులు చూపించాలి. మునుపటి గరిష్ఠం CA$ 10,000 (రూ. 6.14 లక్షలు)తో పోలిస్తే ఇది రెండింతలు.
అంగీకార పత్రాల ధృవీకరణ: డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ (DLIs) ద్వారా ప్రతి అభ్యర్థి అంగీకార పత్రాన్ని IRCC ద్వారా ధృవీకరించాలి (2023 డిసెంబరు నుంచి అమలులోకి వచ్చింది).
స్టడీ పర్మిట్ లిమిట్: 2025లో గరిష్ఠంగా 4,37,000 పర్మిట్లు మాత్రమే మంజూరు చేస్తారు.
తాత్కాలిక నివాసితుల పరిమితి: 2028 నాటికి దేశ జనాభాలో 5% మించకూడదు.
ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు తమ అర్హతలు, నిధుల సన్నద్ధత, పర్మిట్ ఖర్చుల విషయాల్లో ముందుగానే అవగాహన కలిగి ఉండాలి. స్టడీ పర్మిట్ ధర CA$ 150 కాగా, బయోమెట్రిక్స్ కోసం అదనంగా CA$ 85 చెల్లించాల్సి ఉంటుంది.