యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ? ఇరాన్‌కు షాకిస్తూ సౌదీకి మద్దతు..
యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ? ఇరాన్‌కు షాకిస్తూ సౌదీకి మద్దతు..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు పొరుగు దేశాలకు కూడా పాకుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో అనూహ్యంగా పాకిస్తాన్ పేరు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ తటస్థంగా ఉన్న పాక్, ఇప్పుడు ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియాకు మద్దతుగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న లోతైన రక్షణ ఒప్పందమే ఇప్పుడు పాక్‌ను యుద్ధం వైపు నడిపిస్తోంది. గత ఏడాది కుదిరిన ‘స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్’ (SMDA) ప్రకారం.. ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కరిపై పరాయి దేశం దాడి చేసినా, మరొక దేశం సైనికంగా అండగా నిలవాలి. ప్రస్తుతం సౌదీ అరేబియాపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగుతుండటంతో, ఒప్పందం ప్రకారం సౌదీకి మద్దతుగా రంగంలోకి దిగాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పై ఉంది.
సౌదీతో తమకు ఉన్న రక్షణ సంబంధాల గురించి ఇరాన్‌కు బాగా తెలుసని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ స్పష్టం చేశారు. తమ మిత్ర దేశమైన సౌదీ అరేబియా ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అయితే ఇప్పుడే నేరుగా యుద్ధం ప్రకటిస్తామని చెప్పకపోయినా, పరిస్థితులు విషమిస్తే మాత్రం సౌదీ పక్షాన నిలబడతామని పాక్ తన వైఖరిని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కావడం ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ధనిక దేశమైన సౌదీకి, అణ్వస్త్ర బలం ఉన్న పాకిస్తాన్ తోడైతే పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉంది. గతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల నేపథ్యంలో అమెరికాను పూర్తిగా నమ్మలేక, సౌదీ అరేబియా వ్యూహాత్మకంగా పాక్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
#Pakistan #SaudiArabia #IranIsraelWar #GlobalPolitics #DefenseDeals #MiddleEastWar #IshaqDar #BreakingNews #MilitaryAlliances