
రష్యా, ఉక్రెయిన్ మరోసారి శాంతి సంకేతాలు!
మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యలో ఓ విరామం లభించింది. రెండు దేశాలు ఒకదానికొకటి 1,000 మంది యుద్ధ ఖైదీలను విడిచి పెట్టాయి.
ఇస్తాంబుల్‌లో ఈ నెల ప్రారంభంలో జరిగిన ప్రత్యక్ష చర్చల సందర్భంగా ఈ మార్పిడి ఒప్పందం కుదిరింది. ఈ మార్పిడి, ఇప్పటివరకు జరిగిన వాటిలో అతిపెద్దదిగా చరిత్రలో నిలిచిపోయింది.
ఈ మార్పిడి మూడు రోజులు కొనసాగి, ఆదివారం చివరికి 303 మంది ఖైదీల పరస్పర బదలాయింపుతో ముగిసింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలడిమిర్ జెలెన్‌స్కీ ఈ విషయాన్ని ఆదివారం ‘ఎక్స్’ (పూర్వపు ట్విట్టర్) ద్వారా ధృవీకరించారు. “303 మంది ఉక్రెయిన్ రక్షకులు ఇల్లు చేరారు” అని ఆనందంతో ప్రకటించారు.
ఈ మార్పిడి కోసం ఇస్తాంబుల్‌లో జరిగిన ముఖాముఖి చర్చలే యుద్ధం మొదలైన తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష సమావేశం కావడం గమనార్హం. బంధీల మార్పిడి సమయంలో పౌరులకూ స్వేచ్ఛ లభించింది – ఇది శాంతికి దారితీసే మైలురాయిగా పరిగణించవచ్చు.
అయితే, ఈ శుభవార్తల మధ్యే రష్యా భారీ డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత తీవ్ర వైమానిక దాడిగా దీనిని ఉక్రెయిన్ అధికారులు వర్ణించారు. కనీసం 12 మంది మృతి చెందగా, మరెంతో మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది.
మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, శనివారం రాత్రి 110 ఉక్రెయిన్ డ్రోన్లను వారి వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. ఈ విషయంలో మాస్కో నుంచి బాంబుల దాడులపై ఎలాంటి అధికారిక స్పందన లేదు.
కీవ్ సమీపంలోని ప్రాంతాల్లో, రష్యా దాడుల్లో నాశనం చెందిన ఇళ్లలో మంటలను ఆర్పుతూ రెస్క్యూ బృందాలు పడ్డ కష్టాలు హృదయవిదారకంగా నిలిచాయి.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మళ్లీ శాంతి కోసం పశ్చిమ దేశాల మద్దతు కోరుతూ, రష్యాపై ఆంక్షలు మరింత కఠినంగా విధించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ, ఖైదీల మార్పిడి ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌కు శాంతి ఒప్పందం ముసాయిదా అందజేస్తామని వెల్లడించారు.
జెలెన్‌స్కీ మరోసారి హామీ
“ప్రతి ఉక్రెయిన్ పౌరుడు ఇంటికి తిరిగి రావాల్సిందే” అంటూ, యుద్ధంలో బలైపోతున్న తమ దేశ పౌరుల కోసం శాంతి ప్రయత్నాలు కొనసాగిస్తానని ప్రకటించారు.
ఈ మార్పిడి యుద్ధ ప్రారంభం తర్వాత జరిగిన అనేక బంధుమార్పిళ్లలో భాగమే అయినప్పటికీ, పౌరులను కలుపుకుని జరుగడం, అతిపెద్ద స్థాయిలో ఉండటం విశేషం. యుద్ధంలో లక్షల మంది సైనికులు గాయపడగా, వేలాది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.