భయం గుప్పెట్లో కోటి మంది భారతీయులు..
ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య మొదలైన భీకర పోరు పశ్చిమాసియాను అతలాకుతలం చేస్తోంది. ఈ యుద్ధ మేఘాల మధ్య అక్కడ నివసిస్తున్న సుమారు కోటి మంది భారతీయులు ప్రాణభయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. క్షిపణులు, డ్రోన్ల దాడులతో ఆకాశం నిప్పులు కురిపిస్తుంటే, ఏం జరుగుతుందో తెలియక వేలాది మంది షెల్టర్ల కోసం వెతుకులాడుతున్నారు. మరోవైపు విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో స్వదేశానికి రావాలనుకున్న వేలాది మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
యుద్ధ క్షేత్రంలో భారతీయ ప్రవాసులు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో అత్యధికంగా పశ్చిమాసియాలోనే నివసిస్తున్నారు. గణాంకాల ప్రకారం సౌదీ అరేబియాలో 24.63 లక్షలు, యూఏఈలో 35.68 లక్షలు, కువైట్‌లో 9.95 లక్షలు, ఖతార్‌లో 8.36 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీరితో పాటు ఇజ్రాయెల్‌లో లక్ష మంది, ఇరాన్‌లో 10 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. యుద్ధ తీవ్రత పెరగడంతో వీరందరి భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆకాశంలో క్షిపణుల శకలాలు పడుతుండటంతో స్థానిక అధికారులు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు.
విమానాశ్రయాల్లో నిలిచిన ప్రయాణం
యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోని ప్రధాన విమానాశ్రయాలైన దుబాయ్, అబూధాబీ, షార్జా వంటి చోట్ల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. అటు గమ్యస్థానానికి వెళ్లలేక, ఇటు వెనక్కి రాలేక పడిగాపులు కాస్తున్నారు. మొబైల్ ఫోన్లలో వస్తున్న హెచ్చరికలు, ఆకాశంలో దట్టంగా వ్యాపిస్తున్న పొగలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల వారిపై ప్రభావం
యూఏఈ జనాభాలో 35 శాతం మంది భారతీయులే కాగా, అందులో కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసుల సంఖ్యే అధికం. ఉపాధి నిమిత్తం వెళ్లిన వేలాది మంది తెలుగు వారు ఇప్పుడు యుద్ధం మధ్య చిక్కుకోవడంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తగినన్ని బాంబ్ షెల్టర్లు అందుబాటులో లేకపోవడం, నిత్యావసరాల కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రవాస భారతీయులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు.
#WestAsiaWar #IndiansInGulf #IsraelIranWar #NRISafety #GlobalCrisis #IndiansAbroad #WarZone #EmergencyEvacuation #GulfNews #Agnipath
