
భారత్ అణు ప్రస్తావనలపై గట్టిగా స్పందన
ఇస్లామాబాద్ :తమ దేశానికి సంబంధించిన అన్ని అణ్వాయుధాలు చాలా భద్రంగా ఉన్నాయని పాకిస్తాన్ చెప్పింది. తమ దేశం కలిగి ఉన్న విస్తృతమైన అణు భద్రతా వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన విమర్శలకు కౌంటర్‌గా పాకిస్తాన్ శుక్రవారం తన అణు ఆయుధాల నియంత్రణ వ్యవస్థలు దృఢంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
గురువారం శ్రీనగర్‌లో భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, పాక్‌లో అణు ఆయుధాలు సురక్షితంగా లేవు, కాబట్టి వాటిని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణకు అప్పగించాలని అన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఈ ప్రకటిన చేసింది. రాజనాథ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ,
పాక్ విదేశాంగ శాఖ (ఎఫ్‌ఓ) ఒక మీడియా ప్రశ్నకు సమాధానంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌కు తన సమగ్ర అణు భద్రతా వ్యవస్థ బలంగా ఉందన్న నమ్మకం ఉందని, వాటి నియంత్రణ నిర్మాణాలు కూడా బలంగా ఉన్నాయని ప్రకటించింది.
భారత అణు ఆయుధాల విషయంలో అంతర్జాతీయ సమాజం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్ అభిప్రాయపడింది. భారత్‌లో విస్తరిస్తున్న రాజకీయ మతీయత, మీడియా వ్యవస్థ మరియు కొంత సమాజం అణు భద్రతను ప్రశ్నించే స్థాయికి వెళ్తున్నాయని ఆరోపించింది.