
న్యూఢిల్లీ, మే 24: వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలంటే కేంద్రం మరియు రాష్ట్రాలు ఒకే జట్టు లా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ, భారత వికాసానికి వేగం పెంచాల్సిన అవసరం ఉందని, కేంద్రం-రాష్ట్రాలు కలిసి టీమ్ ఇండియాలాగా ముందడుగు వేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు.
ఈ సమావేశం ప్రధానంగా ‘వికసిత రాజ్యం నుంచి వికసిత భారత్@2047’ అనే ధ్యేయాన్ని కేంద్రంగా పెట్టుకొని కొనసాగుతోంది. ప్రతి రాష్ట్రం వికసితమైనపుడే భారత్ వికసితమవుతుందనే భావనను ప్రధాని పునరుద్ఘాటించారు. “140 కోట్ల భారతీయుల ఆశయమే ఇది” అన్నారు మోదీ.
ఈ అత్యున్నత స్థాయి గవర్నింగ్ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్‌కు మోడీనే ఛైర్మన్.
ప్రతి రాష్ట్రాన్ని, నగరాన్ని, పంచాయతీని వికసితంగా తయారు చేయడమే మన లక్ష్యంగా ఉండాలని, అప్పుడు 2047 కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రంలో ఒకటి గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలని సూచిస్తూ, దానివల్ల పరిసర నగరాలూ పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చెందతాయని అభిప్రాయపడ్డారు.
భారతదేశం వేగంగా పట్టణీకరణ వైపు పోతున్న నేపథ్యంలో, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నగరాలు మన లక్ష్యంగా ఉండాలని ప్రధాని సూచించారు. అభివృద్ధిలో గ్రోత్, ఇన్నొవేషన్, సస్టైనబిలిటీ మూడూ మూల సూత్రాలుగా ఉండాలని వివరించారు.
అంతేకాదు, మహిళల కార్యప్రవేశాన్ని ప్రోత్సహించే విధంగా చట్టాలు, విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని హితవు పలికారు. “వారిని గౌరవంగా కార్మిక బలగంలో భాగం చేసుకునే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దాలి” అని ఆయన అన్నారు.
ఈ సమావేశం, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధానమంత్రి మొదటిసారిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన ముఖ్యమైన సమావేశంగా గుర్తింపు పొందింది.